
కావలసిన పదార్థాలు: 250 గ్రాముల బియ్యపు రవ్వ, 4 కప్పులు నీళ్లు ఇక్కడ రవ్వ తీసుకున్న కప్పు కొలతతో నీళ్లు తీసుకోవాలి, 2 టీస్పూన్లు ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె, 4 మీడియం సైజు నిమ్మకాయల రసం. ఘుమఘుమలాడే తాలింపు కోసం: 4 టేబుల్ స్పూన్ల నూనె, కొద్దిగా వేరుశనగ గుళ్లు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్లు, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సన్నని అల్లం తరుగు, 5-6 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 3-4 ఎండుమిర్చి, తాజా కరివేపాకు, పావు టీస్పూన్ ఇంగువ చాలా ముఖ్యం.

తయారీ విధానం: అడుగు మందంగా ఉన్న పాత్ర లేదా పాన్‌లో 4 కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు 2 టీస్పూన్ల ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఇప్పుడు ఒకటిన్నర కప్పుల బియ్యపు రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా వెంటనే గరిటెతో బాగా కలపాలి. మీడియం మంటపై రెండు నిమిషాలు ఉడికించి, మిశ్రమం దగ్గరపడ్డాక మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో పెట్టి మూతపెట్టాలి.

నీరంతా ఆవిరై రవ్వ మెత్తగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతూ 7 నుండి 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ రవ్వను పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక ముద్ద లేకుండా చక్కగా పొడిపొడిగా మారుతుంది. మరో పాన్‌లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి మొదట పల్లీలు వేసి సగం వేగనివ్వాలి.

ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా ఎర్రగా వేయించాలి. అనంతరం సన్నని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అల్లం పచ్చివాసన పోయేలా వేపాలి. చివరగా పావు టీస్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి.

పోపు ఉన్న పాత్రలోకి లేదా వెడల్పాటి తాంబూలంలోకి చల్లారిన బియ్యపు రవ్వను వేయాలి. దీనిపై 4 నిమ్మకాయల రసాన్ని పోయాలి. గరిటె కంటే చేత్తో నలుపుతూ కలిపితే పోపు, నిమ్మరసం రవ్వకు సమంగా పట్టి ఉండలు లేకుండా పులిహోర పొడిపొడిగా తయారవుతుంది. అంతే, నోరూరించే బియ్యపు రవ్వ పులిహోర సిద్ధం! దేవుడి నైవేద్యానికి ప్రసాదంగా సమర్పించినా, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తిన్నా అమృతంలా ఉంటుంది