
రోజంతా ఉత్సాహంగా ఉండాలనుకునే వారికి ఉదయం వేళ అరటిపండు తినడం మంచిది. ఉదయం శరీరానికి తక్షణ శక్తి అవసరం అవుతుంది. అరటిపండులోని సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. ఉదయం అల్పాహారంతో కలిపి అరటిపండు తింటే మధ్యాహ్నం వరకు నీరసం రాకుండా కాపాడుతుంది.

మధ్యాహ్న సమయంలో శరీర జీవక్రియ చురుగ్గా పనిచేస్తుంది. ఆ సమయంలో లేదా లంచ్ తర్వాత స్నాక్స్‌గా అరటిపండు తీసుకోవడం చాలా ప్రయోజనకరం. ఇది ఆఫీస్ లేదా పని వేళల్లో వచ్చే బద్ధకాన్ని దూరం చేయడమే కాకుండా, కడుపు నిండిన అనుభూతిని ఇచ్చి అనవసరమైన జంక్ ఫుడ్ తినకుండా నిరోధిస్తుంది.

రాత్రి పూట అరటిపండు తినడంపై సాధారణంగా పలు అపోహలు ఉంటాయి. డాక్టర్ దీప్తి ప్రకారం.. జలుబు, దగ్గు లేదా కఫం సమస్యలు ఉన్నవారు రాత్రి వేళ అరటిపండుకు దూరంగా ఉండటమే మంచిది. రాత్రి సమయంలో జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిస్తుంది కాబట్టి బరువైన ఆహారం త్వరగా జీర్ణం కాదు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారు సాయంత్రం లేదా రాత్రి ప్రారంభంలో తినవచ్చు కానీ, పడుకునే ముందు మాత్రం తినకూడదు.

ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే, అలసట, బలహీనతతో బాధపడేవారికి అరటిపండు తక్షణ శక్తినిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే అరటిపండులోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

అరటిపండు శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉండే ప్రత్యేక పోషకాలు హ్యాపీ హార్మోన్ల విడుదలకు దోహదం చేసి, ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను మెరుగుపరుస్తాయి. రోజులో సరైన సమయాన్ని బట్టి క్రమం తప్పకుండా అరటిపండును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.