
నాన్-వెజ్ ప్రియులకు మటన్ అంటే ఎంత ఇష్టమో, మటన్ పాయ అన్నా అంతే క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం ఉదయం పూట వేడివేడి దోశలు, పూరీలు లేదా చపాతీల్లోకి ఈ పాయ సూప్ లేదా గ్రేవీ నంజుకుని తింటుంటే స్వర్గం కనిపిస్తుంది. పైగా ఈ వంటకం కేవలం రుచికరమైనదే కాదు, ఎముకల బలానికి కూడా ఎంతో మంచిది. అయితే చాలామందికి ఇంట్లో పాయ చేసినప్పుడు గ్రేవీ పల్చగా అయిపోతుంటుంది లేదా ముక్క సరిగ్గా ఉడకదు. అలా కాకుండా, సింపుల్ మసాలాలతో చిక్కటి గ్రేవీ వచ్చేలా, ముక్క నోట్లో పెడితే కరిగిపోయేలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు: ఈ రెసిపీ కోసం ముఖ్యంగా నాలుగు మేక కాళ్లు (మటన్ పాయ), మీడియం సైజు ఉల్లిపాయలు రెండు, టమాటాలు రెండు, పచ్చిమిర్చి ఐదారు, సాజీరా పావు స్పూన్, ఒక బిర్యానీ ఆకు కావాలి. మసాలా పేస్ట్ కోసం ధనియాలు అర టేబుల్ స్పూన్, జీలకర్ర అర టీస్పూన్, మిరియాలు అర టీస్పూన్, చెక్క ఒక ఇంచ్, లవంగాలు 4-5, యాలకులు 2, ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటు నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర అవసరమవుతాయి.

తయారీ విధానం: ముందుగా మేక కాళ్లను ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. ఇప్పుడు కుక్కర్‌లో నూనె వేసి, కాగాక సాజీరా, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేపి, ఆపై టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా మగ్గించాలి. ఇవి మగ్గాక, గ్రేవీ చిక్కదనం కోసం ఈ ఉల్లిపాయ-టమాటా మిశ్రమంలో సగభాగం తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన సగంలో కడిగిన కాళ్లు, పసుపు, కరివేపాకు, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్‌లో 4-5 నిమిషాలు బాగా వేగనివ్వాలి.

మరోపక్క ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, ఎండు కొబ్బరిని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఆ పొడిలోనే మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ-టమాటా ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు వేగుతున్న కాళ్ల ముక్కల్లో కారం, మనం నూరుకున్న మసాలా పేస్ట్, తగినంత ఉప్పు వేసి లో ఫ్లేమ్‌లో ఐదు నిమిషాలు వేపాలి. మసాలా బాగా వేగాక నాలుగు గ్లాసుల నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 10 నుండి 12 విజిల్స్ రానివ్వాలి.

ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీస్తే చిక్కటి గ్రేవీతో ఘుమఘుమలాడే మటన్ పాయ సిద్ధంగా ఉంటుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ పద్ధతిలో చేస్తే గ్రేవీ పల్చబడకుండా పక్కా హోటల్ స్టైల్‌లో అద్భుతమైన రుచితో వస్తుంది.