
బ్యాచిలర్స్ సైతం ఎంతో సులభంగా, తక్కువ సమయంలో చేసుకోగలిగే ఒక ప్రత్యేకమైన సీక్రెట్ మసాలా ముద్దతో అదిరిపోయే ఆంధ్రా ఆలూ రోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: అర కిలో కొత్త బంగాళదుంపలు, నూనె - పావు కప్పు, కరివేపాకు - ఒక రెమ్మ, ఆవాలు - అర టీస్పూన్, జీలకర్ర - అర టీస్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు - 8 నుండి 10, కశ్మీరీ కారం - ఒక టీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, ఉప్పు - తగినంత, కొద్దిగా కొత్తిమీర. మసాలా పేస్ట్ కోసం: ఎండుమిర్చి - 4 నుండి 5, మిరియాలు - ఒక టీస్పూన్, జీలకర్ర - ఒక టీస్పూన్, ధనియాలు - ఒక టేబుల్ స్పూన్, సోంపు - అర టీస్పూన్ (ఐచ్ఛికం).

తయారీ విధానం: మొదటగా బంగాళదుంపలను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. పాతవి, మొలకలొచ్చిన దుంపలు తీపిగా ఉండి కూర రుచిని పాడుచేస్తాయి, కాబట్టి మంచి కొత్త దుంపలను ఎంచుకోవాలి. దుంపల చెక్కు తీసి సమానమైన ముక్కలుగా కోసుకుని, వెంటనే ఐస్ కోల్డ్ వాటర్‌లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దుంపలలోని స్టార్చ్ పోయి వేపుడు ముద్దగా కాకుండా క్రిస్పీగా వస్తుంది.

తర్వాత మరిగే నీటిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఈ ఆలూ ముక్కలను 70 శాతం వరకు సుమారు 12-15 నిమిషాలు ఉడికించి, నీటిని వడకట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా ఒక మిక్సీ జార్‌లో ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, మరియు సోంపు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మసాలా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు బాండీలో పావు కప్పు నూనె వేసి వేడి చేయాలి. ఆలూ రోస్ట్‌కు నూనె కాస్త ఎక్కువ ఉంటేనే రుచి. నూనె వేడెక్కాక కరివేపాకు, ఆవాలు, జీలకర్ర మరియు దంచిన పొట్టు వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించాలి. వెల్లుల్లి వేగిన తర్వాత మనం సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు బాగా వేపాలి.

ఆపై కశ్మీరీ కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి, ముందుగా ఉడికించి చల్లార్చుకున్న ఆలూ ముక్కలను ఇందులో చేర్చాలి. మసాలా అంతా ముక్కలకు పట్టించి మీడియం నుండి హై ఫ్లేమ్‌పై 20-25 నిమిషాల పాటు అడుగంటకుండా కలుపుతూ వేపాలి. ముక్కలు ఎర్రగా వేగి, అంచులు కాలినట్లుగా మచ్చలు పడ్డాక కొత్తిమీర చల్లుకుని దించేయాలి. అంతే, ఎంతో రుచికరమైన క్రిస్పీ ఆలూ రోస్ట్ సిద్ధం!