
ఈ ప్రసాదాన్ని పచ్చి అటుకులతో కాకుండా, పేపర్ అటుకులను నేతిలో వేయించి, పాకం పట్టి చేయడం వల్ల మెత్తబడిపోకుండా పంటికి కరకరలాడుతూ అద్భుతమైన రుచితో ఉంటుంది. అంతేకాకుండా గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే వారం పది రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ ప్రసాదం తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

కావలసిన పదార్థాలు: రెండు కప్పుల పేపర్ అటుకులు, అర కప్పు నుండి ముప్పావు కప్పు తురిమిన బెల్లం, రెండు నుండి మూడు టీస్పూన్ల నెయ్యి, పావు కప్పు జీడిపప్పు & కిస్‌మిస్, పావు కప్పు తురిమిన ఎండుకొబ్బరి, పావు టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం ఇది ఆప్షనల్, పావు కప్పు నీళ్లు.

ముందుగా పేపర్ అటుకులను జల్లెడలో వేసి జల్లించుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి రెండు టీస్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్ వేసి దోరగా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో మరో టీస్పూన్ నెయ్యి వేసి, తురిమిన ఎండుకొబ్బరి వేసి లో ఫ్లేమ్‌లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి అదే ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఇప్పుడు పాన్‌లో జల్లించిన అటుకులు వేసి చిన్న మంటపై రంగు మారకుండా కేవలం ఒకటి నుండి రెండు నిమిషాలు వెచ్చబడేలా వేయించి, డ్రైఫ్రూట్స్ ఉన్న ప్లేట్‌లో వేసి చేత్తో అంతా బాగా కలపాలి. మళ్లీ పాన్ పెట్టి అందులో ముప్పావు కప్పు తురిమిన బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మట్టి, నలకలు లేకుండా వడకట్టాలి.

వడకట్టిన బెల్లం నీళ్లను తిరిగి పాన్‌లో పోసి చిన్న మంటపై మరిగించాలి. తీగపాకం రానవసరం లేదు; గులాబ్ జామున్ పాకం కంటే కాస్త చిక్కగా, జిగురుగా మారే వరకు మరిగించాలి. పాకం చిక్కబడిన వెంటనే అందులో వేయించి పెట్టుకున్న అటుకులు, కొబ్బరి, డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని వేయాలి. మంటను లో ఫ్లేమ్‌లోనే ఉంచి పాకం మొత్తం అటుకులకు పట్టేలా నిదానంగా కలపాలి. ఇందులోనే సువాసన కోసం యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే కమ్మని అటుకుల ప్రసాదం సిద్ధం! శ్రీకృష్ణుడికి లేదా ఏ దేవునికైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. పూర్తిగా చల్లారాక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెడితే వారం రోజుల పాటు క్రిస్పీగా నిల్వ ఉంటుంది!