
కొత్త ఇంట్లో భర్త ఇష్టాయిష్టాలు ఏంటి? అతని వ్యక్తిత్వానికి తగ్గట్టుగా తాను ఎలా ఉండాలి? తమ బంధాన్ని మరింత మధురంగా మార్చుకోవడానికి చిట్కాల కోసం చాలామంది మహిళలు వెతుకుతుంటారు. ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న వారు, తన భర్త మనసులో స్థానం సంపాదించడం ఎలా అనే అంశంపై గూగుల్‌ను సలహాలు అడుగుతుంటారు. బంధం బలంగా ఉండాలని వారు చేసే ప్రయత్నం ఇది.

సంబంధంలో తన మాటకు కూడా విలువ ఉండాలని, తన అభిప్రాయాలను భర్త గౌరవించాలని మహిళలు కోరుకుంటారు. భర్తకు తన మనసులోని మాటను సున్నితంగా ఎలా చెప్పాలి? తన మాట వినేలా ఎలా చేసుకోవాలి? అనేవి వారి సెర్చ్ లిస్ట్‌లో ఉంటాయి. అంతేకాకుండా అత్తమామలు, ఆడపడుచులతో ఎలా కలిసిపోవాలి? కొత్త వాతావరణంలో తనకంటూ ఒక గుర్తింపును ఎలా తెచ్చుకోవాలి? అనే సామాజిక అంశాలపై చిట్కాలు వెతుకుతుంటారు.

పిల్లల్ని కనడానికి సరైన సమయం ఏది? కెరీర్ పరంగా, ఆరోగ్య పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే ఆరోగ్య సంబంధిత సమాచారం కోసం మహిళలు ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు.

పెళ్లికి ముందు స్వేచ్ఛగా ఉన్న అమ్మాయి, పెళ్లయ్యాక ఇంటి బాధ్యతలు, బంధుత్వాలు, పండుగలు.. ఇలా అన్నింటినీ సమర్థవంతంగా ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలని ఆరాటపడుతుంది.

నేటి తరం మహిళలు ఉద్యోగ రీత్యా కూడా బిజీగా ఉంటున్నారు. పెళ్లి తర్వాత ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తన వృత్తిలో రాణించడం ఎలా? రెండింటినీ బ్యాలెన్స్ చేసే మార్గాలేంటి? అని గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.