
చెట్లను అందరూ ప్రేమిస్తారు. పెంచటానికి కొందరికి సమయం ఉండదు. అయినా ప్రకృతిని చూసి మురిసిపోవడం మాత్రం అందరూ చేసేదే. మనిషి నిర్లక్ష్యం, స్వార్థం వల్ల కొన్ని చోట్ల చెట్లను నరికి వేస్తుంటారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కధనం దానికి భిన్నం. ఏళ్లుగా పెరిగిన ఒక చెట్టును, వృక్షంగా మలిచి ప్రేమగా దాన్ని అక్కడివాళ్లు చూసుకుంటున్నారు.

ఇటువంటి చెట్లను చూడాలంటే అదృష్టం ఉండాలి. భారీ వృక్షాలను చూసినప్పుడు మనసుకు కలిగే ఆ ఆనందాన్ని వర్ణించలేము. ఎక్కడో అడవుల్లో మాత్రమే కనిపించే భారీ వృక్షం.. నిత్యం రద్దీగా ఉండే పట్టణ ప్రాంతంలో కనిపిస్తుండటంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెద్ద పెద్ద ఊడలతో పెరిగిన ఈ వటవృక్షాన్ని చూసి పకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు.

ఇంత అందమైన వృక్షాన్ని చూడాలంటే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్ళాల్సిందే. మర్రి చెట్టునే వటవృక్షం అంటారు. మర్రి చెట్టు నీడన మరో చెట్టు పెరిగిందని చాలా ప్రాంతాల్లో చెట్లను తొలగిస్తూ ఉంటారు. కానీ భీమవరంలోని భారతీయ విద్యా భవన్స్ స్కూల్‌లో మర్రి చెట్టును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. సుమారు ఆరవై ఐదు ఏళ్ళ వయస్సు ఉన్న మర్రి చెట్టు.. ఊడలతో ఇరవై వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది.

మర్రి చెట్టు మొదలు.. ఊడల మధ్యలోనే పెద్ద రోడ్డునే నిర్మించారు. చెట్టు క్రింద నుంచి ఊడల మధ్యలో రోడ్డుపై నడుచుకుని వెళుతుంటే ఆ అనుభూతే వేరు. పెద్ద మర్రిచెట్టు, పెద్ద పెద్ద ఊడలు, మద్యలో రోడ్డుతో ఆ ప్రాంతమంతా ఆకర్షనీయంగా మారిపోయింది. అంతేకాదు హిందువులు మర్రి చెట్టుపై త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారని నమ్ముతారు.

మర్రి పిన మందులుగా వాడటం ఎప్పటి నుంచో ఉంది. దీని బెరడు, ఆకులు, మొగ్గలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధుల్లో మర్రిని వాడుతారు. ఇంత విశిష్టమైన మర్రిని చూసేందుకు స్థానికులు, ప్రకృతి ప్రేమికులకు ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ విద్యా భవన్స్ నిర్వాహకులు ఊడల మర్రిని చూసేందుకు ప్రత్యేక దినాలలో అవకాశం కల్పిస్తున్నారు.