
చాలామంది చేసే ప్రధాన పొరపాటు వేడి ఆహార పదార్థాలను మిక్సర్‌లో వేసి రుబ్బడం. పొయ్యి మీద నుంచి దించిన వెంటనే వేడి వేడి మసాలాలు లేదా సూప్ తయారీ కోసం వండిన కూరగాయలను జార్‌లో వేయకూడదు. ఈ వేడి పదార్థాలు జార్ లోపల అధిక ఒత్తిడిని సృష్టిస్తాయి. దీనివల్ల మిక్సర్ ఆన్ చేయగానే మూత అకస్మాత్తుగా తెరుచుకుని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా వేడి పదార్థాలను తరచూ రుబ్బడం వల్ల జార్, మోటారు రెండూ దెబ్బతింటాయి, కాబట్టి పదార్థాలు చల్లారిన తర్వాతే రుబ్బుకోవాలి.

మరో ముఖ్యాంశం ఏంటంటే.. జ్యూస్‌లు లేదా షేక్స్ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్‌ను నేరుగా మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేయడం. ఐస్ ముక్కలు చాలా గట్టిగా ఉండటం వల్ల బ్లేడ్లపై అకస్మాత్తుగా తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల బ్లేడ్లు వంగిపోవడం లేదా విరిగిపోవడం మాత్రమే కాకుండా మోటారుపై కూడా భారం పెరిగి అరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

ఈ మధ్య కాలంలో మార్కెట్లో లభించే కల్తీ పొడుల భయంతో చాలామంది పసుపు, జాజికాయ, దాల్చినచెక్క వంటి కఠినమైన మసాలాలను ఇంట్లోనే మిక్సర్‌లో రుబ్బుతుంటారు. అయితే అతి గట్టిగా ఉండే ఈ పదార్థాలను ఒకేసారి ఎక్కువ మొత్తంలో వేసి రుబ్బడం వల్ల జార్ బ్లేడ్లు పదును కోల్పోతాయి. అంతేకాకుండా మోటారుపై తీవ్రమైన ఒత్తిడి పడి అది కాలిపోయే అవకాశం ఉంది.

అలాగే సమయం ఆదా చేసుకోవడానికి చపాతీ పిండిని మిక్సర్‌లో కలుపుతుంటారు. ఈ చిక్కటి, జిగట పిండి బ్లేడ్‌కు గట్టిగా అంటుకుని మోటారు తిరగకుండా ఆటంకం కలిగిస్తుంది. మరోవైపు బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌ను నీళ్లు లేకుండా ఎక్కువ పరిమాణంలో గ్రైండ్ చేసినా, బియ్యం, గోధుమలు, జొన్నలు వంటి ధాన్యాలను ఒకేసారి నింపి రుబ్బినా మోటారు వేడెక్కి యంత్రం త్వరగా పాడవుతుంది.

వీటన్నింటితో పాటు చాలామంది చేసే మరొక సాధారణ తప్పు మిక్సర్ జార్లను పరిమితికి మించి అధికంగా నింపడం. పదార్థాలు జార్ లోపల స్వేచ్ఛగా తిరగడానికి కొంత ఖాళీ స్థలం తప్పనిసరిగా ఉండాలి. మీ మిక్సర్ గ్రైండర్ ఎక్కువ కాలం మన్నికగా, సుదీర్ఘకాలం ఏ సమస్యలు లేకుండా పనిచేయాలంటే ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించడం అవసరం.