తెలంగాణలో మరో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు

ప్రజల చెంతకు పాలనలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటి ఫలాలు మరింత చేరువ చేసేందుకు అవసరమైన..

  • Jyothi Gadda
  • Publish Date - 7:07 pm, Thu, 16 July 20

ప్రజల చెంతకు పాలనలో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటి ఫలాలు మరింత చేరువ చేసేందుకు అవసరమైన అన్ని చోట్ల రెవెన్యూ డివిజన్‌లను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఎన్నో ఏళ్లుగా అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు మేలు కలుగనుందని సర్కార్‌ భావిస్తోంది. తాజాగా మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో మరో రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మండలాలతో కొత్తగా వేములవాడ రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసింది. వేములవాడ, వేములవాడ రూరల్‌, చందుర్తి, బోయిన్‌పల్లి, కోనారావుపేట, రుద్రంగి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తెలంగాణలో ఇప్పటి వరకు 71 రెవెన్యూ డివిజన్లు ఉండగా, తాజాగా మరొకటి చేరడంతో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72కి చేరింది. కాగా, ప్రభుత్వం నిర్ణయంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.