సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు… ఫేకేనా…?

Old video of Mexico gas plant explosion shared as that of Saudi Aramco attack, సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు… ఫేకేనా…?

ఒక చమురు రిఫైనరీలో పేలుళ్ల కు సంబంధించిన వీడియోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి, అది ఇటీవల సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్వహిస్తోన్న చమురు క్షేత్రాలపై సెప్టెంబర్ 14న డ్రోన్ దాడులు జరిగాయని ప్రచారం జరుగుతోంది. కీలకమైన చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడుల వీడియో అని అంటూ నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. యెమెన్‌ తిరుగుబాటుదారుల గ్రూపు ఈ దాడి చేసినట్లు అంగీకరించారని వార్తలు వచ్చాయి. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ యూజర్లు ఈ విషయాన్ని షేర్, లైక్స్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.

అయితే… సౌదీ అరాంకో చమురు క్షేత్రంపై జరిగిన డ్రోన్ దాడుల వీడియో కాదది. 2012లో మెక్సికోలో గ్యాస్ ప్లాంటులో సంభవించిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియో. ఇన్ విడ్ గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్‌తో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అసలు విషయం వెలుగుచూసింది. 2014లో పోస్ట్ అయిన ‘2012 గ్యాస్ ప్లాంట్ ఎక్స్‌ప్లోజన్ మెక్సికో’ అనే వీడియో దర్శనమిచ్చింది.

మరోవైపు… లూసియానా, టెక్సాస్‌లలో ఉన్న భూగర్భ చమురు నిల్వ కేంద్రాల్లో భారీ పరిమాణంలో చమురు నిల్వ చేస్తున్నారు. సౌదీ అరేబియాలోని కీలకమైన చమురు నిల్వలపై దాడుల నేపథ్యంలో, అమెరికా అధికారులు తమ దేశంలో నిల్వచేసిన అత్యవసర చమురు నిల్వల గురించి చర్చించుకుంటున్నారు. చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ”మార్కెట్‌లో సరఫరాకు ఈ చమురును ఉపయోగించవచ్చు” అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. టెక్సాస్, లూసియానా రాష్ట్రాలలోని ఉప్పు గుహలలో నిల్వ చేసిన 640 మిలియన్ బారెల్స్ కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న నిల్వల గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారు. అయితే, అమెరికాకు ఈ ”వ్యూహాత్మక నిల్వలను” కలిగి ఉండాలనే ఆలోచన 1970లలో వచ్చింది.

ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలోని సభ్య దేశాలు 90 రోజులకు సరిపడా అత్యవసర పెట్రోలియం దిగుమతులు నిల్వ ఉంచుకోవచ్చు. కానీ, అమెరికా ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో అత్యవసర నిల్వలు కలిగి ఉంది. 1973లో అరబ్ దేశాలు-ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా.. ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చింది. దీంతో పెట్రోలియం ఎగుమతి దేశాలు ఇరాక్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాలు అమెరికాకు చమురు ఎగుమతి చేయడానికి నిరాకరించాయి.

ప్రస్తుతం, అమెరికాలో నాలుగు చోట్ల చమురు నిల్వ చేస్తున్నారు. అవి టెక్సాస్‌లోని ఫ్రీపోర్ట్, విన్నీ సమీపంలో, లూసియానాలోని చార్లెస్ సరస్సు, బాటన్ రూజ్ వెలుపల. ప్రతి ప్రాంతంలో చమురు నిల్వ చేసేందుకు వీలుగా భూగర్భంలో ఒక కిలోమీటర్ (3,300 అడుగుల) వరకు అనేక మానవ నిర్మిత ఉప్పు గుహలు ఏర్పాటు చేశారు. భూమిపై ట్యాంకులలో నిల్వ చేయడంకంటే ఇలా చేయడం వల్ల ఖర్చు బాగా తగ్గుతుంది. సురక్షితంగా కూడా ఉంటుంది. ఉప్పు వల్ల భౌగోళిక పీడన ప్రభావంతో చమురు బయటకు రాకుండా నిరోధించవచ్చు.

ఈ గుహలలో సెప్టెంబర్ 13న 644.8 మిలియన్ బారెల్స్ చమురు ఉన్నట్లు రిజర్వ్ వెబ్‌సైట్ తెలిపింది. యూఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, అమెరికన్లు 2018లో సగటున రోజుకు 20.5 మిలియన్ బారెల్స్ పెట్రోలియంను వినియోగిస్తారు. అంటే సుమారు 31 రోజుల పాటు దేశ అవసరాలకు సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని అర్థం. చమురును విడుదల చేయడానికి అధ్యక్షుడికి అధికారం ఉన్నప్పటికీ మార్కెట్లలోకి చమురు రావడానికి దాదాపు రెండు వారాలు పడుతుంది. అంతేకాక, ఇలా విడుదల చేసిన చమురు శుద్ధి చేసినదికాదు. కార్లు, ఓడలు, విమానాలకు ఉపయోగపడే ముందు ఈ చమురును ఇంధనంగా మార్చే ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.

భారత్‌లో కూడా కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో భూగర్భ గుహల్లో ముడిచమురును నిల్వచేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. పెట్రోల్, డీజిల్ ఇతర ఇంధనాలకున్న దేశీయ డిమాండ్ దృష్ట్యా దాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. 12 నుంచి 22 రోజుల అవసరాలకు సరిపడే నిల్వలను ముందు జాగ్రత్తగా అందుబాటులో ఉంచనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో దాదాపు 6.5 మిలియన్ల మెట్రిక్‌ టన్నుల ఆయిల్‌ను నిల్వ చేయాలని భావిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *