
జపాన్‌కు చెందిన రిఫ్రిజరేషన్, వెండింగ్ మెషిన్ తయారీ సంస్థ SDRS ఈ భారీ కూలింగ్ బూత్‌ను అభివృద్ధి చేసింది. పారిశ్రామిక పరికరాల సరఫరా సంస్థ Trusco Nakayama దీన్ని విక్రయిస్తోంది. చూడటానికి ఇది సాధారణంగా కనిపించే పెద్ద ఫ్రిజ్‌లా ఉంటుంది. అయితే ఇందులో పానీయాలు లేదా ఆహార పదార్థాలు కాకుండా మనుషులు కూర్చుని చల్లదనాన్ని పొందవచ్చు. ఈ పరికరానికి ‘Do Hiemon Box’ అనే పేరు పెట్టారు.
ఈ హ్యూమన్ ఫ్రిజ్‌లోపలి ఉష్ణోగ్రతను 15 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచుతుంది. బయట తీవ్రమైన వేడి నుంచి ఇందులోకి వెళ్లిన వెంటనే చల్లటి వాతావరణం అనుభూతి కలుగుతుంది.బతల, మెడ, భుజాలు, వెన్ను భాగాలపై చల్లటి గాలి ప్రసరిస్తుంది. సుమారు 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన గాలి శరీరాన్ని చల్లబరుస్తుంది. దాదాపు ఐదు నిమిషాల్లోనే చల్లదనం అనుభూతి మొదలవుతుంది. పది నిమిషాల పాటు ఉపయోగిస్తే వేడి కారణంగా కలిగే అలసట లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చని కంపెనీ చెబుతోంది.
ఎండ తీవ్రత సమయంలో బయటే పనిచేయాల్సిన వారి కోసం ఈ కూలింగ్ బూత్‌ను ప్రత్యేకంగా రూపొందించారు.
Do Hiemon Boxలో మూడు రకాల గాలి ప్రవాహం, శీతలీకరణ సెట్టింగులు ఉన్నాయి. ఇది 20 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. ఎక్కువ చల్లదనం వల్ల శరీరానికి ఇబ్బంది కలగకుండా భద్రతా వ్యవస్థ ఉంటుంది. చక్రాలతో అమర్చడం వల్ల ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించవచ్చు. ఇంట్లో లేదా బయట ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. సాధారణ స్పాట్ ఎయిర్ కండిషనర్‌తో పోలిస్తే సుమారు సగం విద్యుత్ మాత్రమే వినియోగిస్తుందని కంపెనీ పేర్కొంది. జపాన్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ ఆవిష్కరణ వచ్చింది. ఇటీవల అక్కడ 40 డిగ్రీల సెల్సియస్ దాటే రోజులను ప్రత్యేకంగా గుర్తించే కొత్త పదజాలాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఎండల కారణంగా హీట్‌స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి. జూలై 15న టోక్యోలోనే 48 మంది హీట్‌స్ట్రోక్ కారణంగా ఆసుపత్రుల్లో చేరినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వాలు, సంస్థలు ప్రజలు, ఉద్యోగుల రక్షణ కోసం కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నాయి.
Japan invents a human refrigerator for overheated workers
The vending-machine-inspired booth stays at 15°C (59°F) and blows 5°C (41°F) air over the head, neck and back, cooling users within minutes
Global warming is no longer an issue for Japan pic.twitter.com/EBjiJPLG1H
— RT Intl (@RT_on_X) July 20, 2026
ప్రస్తుతం Do Hiemon Box జపాన్‌లో పారిశ్రామిక పరికరాల సరఫరాదారుల ద్వారా అందుబాటులో ఉంది. ప్రామాణిక మోడల్ ధర 15 లక్షల జపాన్ యెన్ (మన కరెన్సీలో సుమారు రూ.8.8 లక్షలు). ప్రస్తుతం దీన్ని వ్యక్తిగత వినియోగదారుల కంటే కంపెనీలు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నారు. తీవ్రమవుతున్న గ్లోబల్ వేడి పరిస్థితుల నేపథ్యంలో జపాన్ రూపొందించిన ఈ ‘Human Refrigerator’ భవిష్యత్‌లో వేడి నుంచి రక్షణకు కొత్త పరిష్కారంగా మారే అవకాశం ఉంది. అయితే వాతావరణ వేడిని తట్టుకోవడానికి ఇలా రకరకాల పరికరాలను తయారు చేసే బదులు భూమిని చల్లగా ఉంచడానికి కార్భన్ ఉద్గారాల కట్టడి ఇంకా మేలు చేస్తుందని పర్యావరణ వేత్తలు హితవుపలుకుతున్నారు. ఉన్న చెట్లను నరికి వేయకుండా, మొక్కలు నాటి అడవులను విస్తరిస్తే ప్రస్తుత తరంతోపాటు రాబోయే తరాలకు కూడా భూమి నివాసయోగ్యంగా ఉంటుంది.