దారుణం: 90 శునకాలను ఘోరంగా కట్టేసి…

Street Dogs Found Dead In Maharastra, దారుణం: 90 శునకాలను ఘోరంగా కట్టేసి…

అభం.. శుభం తెలియని మూగ జీవులను ఎక్కడపడితే అక్కడ అంతమొందిస్తున్నారు. మొన్నటికి మొన్న బీహార్‌ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో పంట పొలం నాశనం చేసింది.. జింకను కాల్చి సజీవంగా పూడ్చిపెట్టేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది ఇలా ఉండగా మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఒకే ప్రదేశంలో 90 వీధి కుక్కల మృత దేహాలు కనిపించిన ఘటన కలకలం రేపింది. అంతేకాకుండా చనిపోయిన వాటి కాళ్లను తీగలతో కట్టేసి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇక వీటి మృతదేహాలు గిర్దా-సావల్‌దబరా మార్గంలో రోడ్ల పక్కన చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.

దాదాపు ఐదు ప్రాంతాల్లో 100 కుక్కల మృతదేహాలు లభ్యమయ్యాయని.. వీటిలో 90 కుక్కలు చనిపోయి ఉండగా మిగతావి చావుబతుకుల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటన గురువారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం సదరు ప్రాంతానికి చెందిన స్థానికులకు కుళ్లిన వాసన తీవ్రంగా రావడంతో వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చనిపోయిన కుక్కలన్నింటిని పోస్టుమార్టంకు పంపించారు. ఈ నివేదిక వస్తే తప్ప కుక్కలు ఎలా చనిపోయాయో చెప్పలేమని పోలీసులు అన్నారు.

ప్రాధమిక దర్యాప్తు ప్రకారం కొందరు దుండగులు కుక్కలన్నింటిని ట్రక్‌లో ఓ ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ అంతమొందించి.. వాటి మృతదేహాలను వివిధ చోట్ల పారేసి ఉంటారని తెలిపారు. సాక్ష్యాలను సేకరిస్తున్న పోలీసులు.. ఈ ఘటనకు పాల్పడిన దుండగులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *