సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్… భార్య బంధువులపై అనుమానం..?

పవన్‌ హత్యకు కారణమేంటి..? కుటుంబ కలహాలా..? లేక చేతబడి చేశారన్న అనుమానమా..? పవన్‌ హత్యలో అతని భార్య కృష్ణవేణి పాత్ర కూడా ఉందా..? పథకం ప్రకారమే హత్య చేశారా..? అసలేం జరిగిందన్న దానిపై అనేక అనుమానాలు..

  • Sanjay Kasula
  • Publish Date - 8:02 am, Wed, 25 November 20
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సజీవ దహనం కేసులో కొత్త ట్విస్ట్... భార్య బంధువులపై అనుమానం..?

New Twist : జగిత్యాలలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పవన్‌ను దారుణంగా హతమార్చి సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. అయితే పవన్‌ హత్యకు కారణమేంటి..? కుటుంబ కలహాలా..? లేక చేతబడి చేశారన్న అనుమానమా..? పవన్‌ హత్యలో అతని భార్య కృష్ణవేణి పాత్ర కూడా ఉందా..? పథకం ప్రకారమే హత్య చేశారా..? అసలేం జరిగిందన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఐతే ఒకవైపు కుటుంబ కలహాలు.. మరోవైపు చేతబడి చేశారన్న నెపంతో పథకం ప్రకారమే పవన్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. 15 రోజుల క్రితం జగన్ మృతి చెందడంతో పరామర్శించేందుకు పవన్‌ జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతాపూర్‌కు వచ్చాడు. రాత్రి 7 గంటలకు వారు నివాసముండే మంజునాథ ఆశ్రమానికి భార్య కృష్ణవేణితో కలిసి వచ్చాడు.

మృతుని చిత్రపటానికి నివాళులర్పిస్తుండగా.. ముందే వేసుకున్న పథకం ప్రకారం ఒక్కసారిగా పవన్‌ తలపై బాదారు అతని కుటుంబసభ్యులు. ఆ దెబ్బకు పవన్‌ కింద పడిపోవడంతో అక్కడే ఉన్న ఓ గదిలో అతనిని బంధించి.. 20 లీటర్ల పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో పవన్‌ పూర్తిగా సజీవ దహనమయ్యాడు. గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాడు.

పవన్‌ మర్డర్‌ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అయితే పవన్‌ హత్యలో అతని భార్య కృష్ణవేణి పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు మృతుని కుటుంబసభ్యులు. పవన్‌ను ఎలా అయితే దారుణంగా హతమార్చారో.. అతన్ని చంపిన వారిని కూడా అంతే కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తన భర్త చేతబడి చేయించాడనే అనుమానంతో వదిన సుమలతే..ఈ ఘాతుకానికి పాల్పడిందని చెబుతున్నారు మృతుని భార్య. మంటలు చూసి తాను సొమ్మసిల్లి పడిపోయానని.. తనకు స్పృహ వచ్చేసరికే దారుణం జరిగిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.