
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో ఓ భార్య చేసిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కనిపించకుండా పోయాడంటూ 45 రోజుల పాటు తన భర్త కోసం బంధువులతో కలిసి వెతికిన ఓ మహిళ, చివరికి తానే అతడిని హతమార్చి శవాన్ని బాత్రూం టైల్స్ కింద పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆగ్రాకు చెందిన సురేంద్ర కుమార్ శర్మ అనే వ్యక్తి గత మే 18న నుండి కనిపించకుండా పోయాడు. భర్త ఎక్కడికో వెళ్లాడని, త్వరలోనే తిరిగి వస్తాడంటూ అతడి భార్య రూబీ బంధువులను, చుట్టుపక్కల వారిని నమ్మిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే మే 26న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. బంధువులు, పోలీసులు ఎంత వెతికినా సురేంద్ర జాడ దొరకకపోవడంతో ఈ అదృశ్యం కాస్తా పెద్ద మిస్టరీగా మారింది.
మరో పాత కేసుకు సంబంధించిన వెరిఫికేషన్ కోసం శుక్రవారం పోలీసులు సురేంద్ర ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో భార్య రూబీ ప్రవర్తన పోలీసులకు తీవ్ర అనుమానాస్పదంగా అనిపించింది. అదే సమయంలో సురేంద్ర సోదరుడు అనిల్ శర్మ పోలీసులకు కొన్ని కీలక విషయాలు వెల్లడించడంతో అధికారులు ఇల్లంతా క్షుణ్ణంగా సోదా చేయడం ప్రారంభించారు. ఈ తనిఖీల్లో భాగంగా బాత్రూంలోకి వెళ్లిన పోలీసులకు అక్కడ కొత్తగా వేసిన టైల్స్, ప్లాస్టరింగ్ ప్రత్యేకంగా ఆకర్షించాయి. ఏదో దాచారనే అనుమానంతో పోలీసులు ఆ టైల్స్ తొలగించి, బాత్రూం లోపల తవ్వకాలు జరపగా.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న సురేంద్ర మృతదేహం బయటపడింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. సురేంద్రను హత్య చేసిన వెంటనే శవాన్ని బాత్రూంలోనే పూడ్చిపెట్టినట్లు తెలిసింది. నేరానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండేందుకు శవంపై మట్టి పోసి, పైన ప్లాస్టరింగ్ చేసి కొత్త టైల్స్ పరిచారు. పోలీసుల విచారణలో రూబీ తన నేరాన్ని అంగీకరించింది. అయితే ఈ హత్య చేయడానికి ముందే ఆమె బాత్రూం రినోవేషన్ పని కోసం మేస్త్రీ, కూలీలను మాట్లాడి ఉంచుకోవడం గమనార్హం.
సురేంద్ర సోదరుడు అనిల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు సురేంద్రకు రెగ్యులర్‌గా మద్యం తాగే అలవాటు ఉండేది. దీనివల్ల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. బహుశా ఈ కారణంతోనే హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలు సేకరించింది. నిందితురాలైన రూబీని ఇప్పటికే కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణ హత్య వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా? ఈ కుట్రలో ఆమెకు ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.