సూపర్ స్టార్ రజినీకాంత్ గ్లామరస్ వరల్డ్ నుంచి తరచూ రియల్ వరల్డ్ లోకి వస్తున్నారు. ఢిల్లీలో మత ఘర్షణలను ఖండిస్తూ ప్రకటనలు చేసిన ‘బాషా’.. దేశంలో శాంతి నెలకొనేలా చూసేందుకు ఏ పాత్ర అయినా పోషించేందుకు తాను సిధ్ధంగా ఉన్నానన్నారు. ఓ ముస్లిం సంస్థకు చెందిన పెద్దలు ఆదివారం తనను తన నివాసంలో కలిసిన అనంతరం ఆయన ఈమేరకు ట్వీట్ చేశారు. ‘ప్రేమ, సమైక్యత’, ‘శాంతి’ దేశ ప్రధాన ధ్యేయంగా ఉండాలన్న ఈ ముస్లిం నేతల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నానని రజినీకాంత్ పేర్కొన్నారు. తమిళనాడులోని ‘జమాతుల్ ఉమా సబయ్’ అనే ముస్లిం సంస్థకు చెందిన నేతలు ఆదివారం రజినీని కలుసుకుని.. సీఏఏ నేపథ్యంలో తమ వర్గం ప్రయోజనాలను పరిరక్షించేలా చూడాలని అభ్యర్థించారు. ఇందుకు ఆయన.. తన శక్తి మేరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఇటీవల చెలరేగిన హింసను ఉక్కుపాదంతో అణచివేయాలని ఈ సూపర్ స్టార్ గతవారం ఓ ట్వీట్ లో కోరిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న నేతలు హింసను అదుపుచేయలేకపోతే తక్షణమే రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.