
తుమకూరు, ఫిబ్రవరి 27: గుండె భర్త మరణించడంతో ఆ ఇల్లాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. చుట్టు పక్కల జనాలు చూసి అయ్యో పాపం అనుకున్నారు. అయితే భర్త మరణించిన నెల రోజులు కూడా పూర్తి కాకుండానే మృతుడి భార్య మరో వివాహం చేసుకోవడంతో అంతా నోరెళ్లబెట్టారు. పైగా భర్త మరణించిన కొన్ని రోజులకే భార్య తిరిగి వివాహం చేసుకోవడంతో మృతుడి మరణంపై అనుమానాలు తలెత్తాయి. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో అసలు గుట్లు లాగేందుకు ఖననం చేసిన మృతుడి శరీరాన్ని వెలికి తీసి పోస్టుమార్టంకి పంపారు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని తుమకూరు తాలూకా హెబ్బూర్ హోబ్లిలోని దాసరహళ్లిలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
దాసరహళ్లి నివాసి అయిన పరమేష్ (50) జనవరి 31న గుండెపోటుతో మరణించాడు. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించి భూమిలో ఖననం చేశారు. అయితే పరమేష్ మరణించిన కొన్ని రోజులకే అంటే ఫిబ్రవరి 19న అతని భార్య తిరిగి వివాహం చేసుకోవడం బంధువుల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. తన సోదరుడి మరణం అసహజమైనదని అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి సోదరి హెబ్బూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పరమేష్ మరణించినప్పుడు అతని ముక్కు పక్కన గాయం ఉందని, ప్రైవేట్ పార్ట్స్ ఉబ్బిపోయాయని, అతని సోదరుడి మరణం అసహజమైనదని అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశాలు మృతుడి మరణంపై మరింత అనుమానాలకు దారితీసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి శరీరాన్ని ఖననం చేసిన 23 రోజుల తర్వాత మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.
మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని తహశీల్దార్ రాజేశ్వరి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు పంపారు. ఇది అనుమానాస్పద మృతి కేసు కావడంతో వైద్యులు సమగ్ర దర్యాప్తు చేసి వారం రోజుల్లో పోస్టుమార్టం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఈ నివేదిక ఆధారంగా పరమేష్ మరణానికి అసలు కారణం ఏమిటనేది బయటపడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.