రాజ్యసభ్యలో కంటతడి పెట్టిన ప్రధాని మోదీ.. ఆ నేత తనకు మంచి స్నేహితుడంటూ.. ప్రశంసలు కురిపించిన నరేంద్రుడు..

|

Feb 09, 2021 | 12:21 PM

PM Modi Emotional Speech: రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. పదవీకాలం ముగిస్తున్న నేతలను ఉద్దేశించి..

రాజ్యసభ్యలో కంటతడి పెట్టిన ప్రధాని మోదీ.. ఆ నేత తనకు మంచి స్నేహితుడంటూ.. ప్రశంసలు కురిపించిన నరేంద్రుడు..
Follow us on

PM Modi Emotional Speech: రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. పదవీకాలం ముగిస్తున్న నేతలను ఉద్దేశించి ఆయన కాసేపు ప్రసంగించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌ గురించి మాట్లాడేటప్పుడు మోదీ కంటతడి పెట్టుకున్నారు. సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆజాద్ దేశానికీ అందించిన సేవలను ప్రధాని కొనియాడారు. ఆయన భావితరాలకు స్ఫూర్తిమంతుడని వ్యాఖ్యానించారు.

ఓ ఎంపీగా, ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా ఆయన ఇతర సభ్యులు, భవిష్యత్తు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఆజాద్ పనితీరును అందుకోవడం చాలా కష్టమని కితాబిచ్చారు. తన పార్టీ కోసమే కాకుండా దేశం, పార్లమెంట్ కోసం ఆయన పనిచేశారని అన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఆజాద్ ఒకేలా ఉన్నారని మోదీ చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా కశ్మీర్‌లో ఓసారి ఉగ్రదాడి జరిగినప్పుడు గుజరాత్ వాసులు అక్కడ చిక్కుకునిపోయిన విషయాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆజాద్‌తో పాటు ప్రణబ్ ముఖర్జీ గుజరాతీలను కాపాడేందుకు ఎంతగా శ్రమించారో తనకు తెలుసునని ఉద్వేగానికి గురయ్యారు. తన సొంత కుటుంబసభ్యులు చిక్కుకుంటే ఎంత శ్రమిస్తారో, ఆజాద్ అంత శ్రమించారని అన్నారు. ఆయన స్థానంలో ఎవరో ఒకరు వస్తారు, కానీ ఆ వచ్చే వ్యక్తి ఆజాద్ పనితీరును మరిపించాలంటే చాలా కష్టమని అన్నారు.

‘గులాంనబీ ఆజాద్‌ నాకు మించి మిత్రుడు.. నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు మాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది.. మేమిద్దరం ఒకే సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్నాం.. అంతకుముందే ఎన్నోసార్లు కలసుకున్నాం. ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఎంతో ముందుంటారు. ప్రకృతితో మమేకం అవుతారు.ఉద్యానవనాల విషయంలో ఆయనకు అపార పరిజ్ఞానం ఉంది.. పదవులు వస్తుంటాయి. అధికారం దక్కుతుంది. కానీ వాటిని ఎలా నిర్వహించాలన్న విషయాన్ని ఎవరైనా ఆజాద్ ను చూసి నేర్చుకోచ్చు” అని మోదీ వ్యాఖ్యానించారు.

ప్రధాని మాట్లాడుతున్నంత సేపూ పలుమార్లు గులామ్ నబీ ఆజాద్ రెండు చేతులూ జోడించి నమస్కరిస్తూ కనిపించారు. అంతకు ముందు షంశేర్ సింగ్ మన్హాస్ గురించి మాట్లాడిన మోదీ, ‘నా ప్రసంగాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? నేను ఆయనతో ఎన్నో సంవత్సరాలు పనిచేశాను. మా పార్టీ బలోపేతానికి ఆయనతో కలసి స్కూటర్ పై ప్రయాణించిన రోజులు నా మదిలో ఇంకా మెదులుతున్నాయి. రాజ్యసభలో ఆయన హాజరు అద్భుతం.. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు నేను ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటాను’ అని చెప్పారు. వారితో పాటు నజీర్ అహ్మద్ లావే, మొహమ్మద్ ఫయాజ్ తదితరుల సేవలనూ ప్రధాని కొనియాడారు.

Also Read: ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. తొలి టెస్టులో విజయం దిశగా ఇంగ్లాండ్…