రెండు భారతీయ వ్యాక్సిన్లు సురక్షితం.. వాట్సాప్‌‌లో అనవసర పుకార్లను ప్రచారం చేయవద్దన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్

|

Mar 30, 2021 | 8:04 PM

కొవిడ్‌-19 నియంత్రణకు భారత్‌లో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు.

రెండు భారతీయ వ్యాక్సిన్లు సురక్షితం.. వాట్సాప్‌‌లో అనవసర పుకార్లను ప్రచారం చేయవద్దన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్
Health Minister Harsh Vardhan Allays Fear
Follow us on

Health Minister Harsh Vardhan: కొవిడ్‌-19 నియంత్రణకు భారత్‌లో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. వాట్సాప్‌ యూనివర్సిటీలో సాగే ప్రచారాన్ని విశ్వసించరాదని సూచించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎవరికైనా ఇన్ఫెక్షన్‌ సోకినా అది తీవ్రతరమై ఆసుపత్రిలో చేరే పరిస్థితిని వ్యాక్సిన్‌ నివారిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో ప్రజలకు అందిస్తున్న కోవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ రెండూ సురక్షితమైనవని అన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి 12 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసింది.దాదాపు 1,62,000 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. అయితే, కరోనావైరస్ వ్యాధికి సంబంధించిన అనవసర పుకార్లకు దూరంగా ఉండాలని మంత్రి హర్షవర్ధన్ ప్రజలను కోరారు. “రెండు భారతీయ వ్యాక్సిన్లు సురక్షితమైనవి, ప్రభావవంతమైనవని ఆయన తెలిపారు. టీకాల విషయంలో చాలా మందికి ఇంకా సందేహాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దుష్ప్రాచారాన్ని నమ్మవద్దని కేంద్ర మంత్రి కోరారు.


కోవిడ్ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్న తర్వాత తమ మంత్రిత్వ శాఖ అధికారులు ఎవరికీ ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాలేదని ఆయన చెప్పారు. ఢిల్లీ హార్ట్‌ అండ్‌ లంగ్‌ ఇనిస్టిట్యూట్‌లో భార్య నూతన్‌ గోయల్‌తో కలిసి వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్న అనంతరం హర్షవర్ధన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్‌ తర్వాత కొవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఆరు కోట్లకు పైగా కొవిడ్‌ డోసులను ప్రజలకు అందించారు.

ఇదిలావుంటే, మరోవైపు, దేశ‌వ్యాప్తంగా ప‌ది జిల్లాల్లో అత్యధిక స్థాయిలో క‌రోనా వైర‌స్ కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పుణె, ముంబై, నాగ‌పూర్‌, థానే, నాసిక్‌, ఔరంగ‌బాద్‌, బెంగుళూరు అర్బన్‌, నాందేడ్‌, ఢిల్లీ, అహ్మద్‌న‌గ‌ర్ జిల్లాల్లో అత్యధిక కేసులు న‌మోదు అయ్యార‌న్నారు. టాప్ టెన్ జిల్లాల్లో 8 ప్రభావిత జిల్లాలు కేవ‌లం మ‌హారాష్ట్రలోనే ఉన్నట్లు ఆయన తెలిపారు. గత వారం రోజులుగా పరిశీలిస్తే.. వైర‌స్ పాజిటివ్ రేటు దేశంలో 5.65 శాతంగా ఉంది. మ‌హారాష్ట్రలో వారానికి స‌గ‌టు రేటు 23 శాతంగా న‌మోదు అవుతోంద‌ని రాజేశ్ భూష‌ణ్ తెలిపారు.