భర్త వద్దు.. ప్రియుడే ముద్దు.. మండుటెండలో ఏకంగా సెల్ టవర్ ఎక్కేసిందిగా..!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక హై-వోల్టేజ్ డ్రామా స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. మంగళవారం (ఏప్రిల్ 28) మధ్యాహ్నం ఒక వివాహిత తన ప్రియుడి కోసం ఏకంగా మొబైల్ టవర్ ఎక్కి మూడు గంటల పాటు పోలీసులను, కుటుంబ సభ్యులను ముప్పుతిప్పలు పెట్టింది.

భర్త వద్దు.. ప్రియుడే ముద్దు.. మండుటెండలో ఏకంగా సెల్ టవర్ ఎక్కేసిందిగా..!
Married Woman Climbed A Cell Tower

Updated on: Apr 29, 2026 | 1:02 PM

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక హై-వోల్టేజ్ డ్రామా స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. మంగళవారం (ఏప్రిల్ 28) మధ్యాహ్నం ఒక వివాహిత తన ప్రియుడి కోసం ఏకంగా మొబైల్ టవర్ ఎక్కి మూడు గంటల పాటు పోలీసులను, కుటుంబ సభ్యులను ముప్పుతిప్పలు పెట్టింది.

హత్రాస్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్మన గ్రామానికి చెందిన యశ్‌పాల్ భార్య పూజ (30), మంగళవారం (ఏప్రిల్ 28) మధ్యాహ్నం తన అత్తగారింటి నుండి అకస్మాత్తుగా బయలుదేరింది. నేరుగా లుట్సాన్ రోడ్డుకు చేరుకున్న ఆమె, అక్కడ ఉన్న ఒక మొబైల్ టవర్‌ను వేగంగా ఎక్కి శిఖరంపై కూర్చుంది. అంత ఎత్తులో మహిళను చూసిన బాటసారులు షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపటికే పూజ స్వయంగా తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను టవర్ ఎక్కినట్లు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందిన వెంటనే పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి విపిన్ చౌదరి, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూజ తండ్రి రాజేంద్ర, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దిగమని పదేపదే వేడుకున్నా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమిస్తుండటంతో, ఒకవేళ ఆమె పైనుంచి దూకితే ప్రాణాపాయం కలగకుండా అగ్నిమాపక సిబ్బంది టవర్ కింద జంపింగ్ ఫ్లోర్‌ను ఏర్పాటు చేశారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో పూజకు, ఆమె ప్రియుడు జైప్రకాష్‌కు మధ్య గొడవ జరిగిందని తేలింది. దీంతో పోలీసులు గాలింపు చేపట్టి జైప్రకాష్‌ను సంఘటనా స్థలానికి తీసుకువచ్చారు. ప్రియుడిని చూడగానే పూజ శాంతించింది. అతనితో ఫోన్‌లో మాట్లాడిన తర్వాతే, దాదాపు మూడు గంటల ఉత్కంఠకు తెరదించుతూ ఆమె సురక్షితంగా కిందకు దిగింది.

పూజకు రెండేళ్ల క్రితమే వివాహం జరిగిందని, అయితే జైప్రకాష్‌తో ఆమెకు చాలా కాలంగా ప్రేమలో ఉందని తండ్రి రాజేంద్ర తెలిపారు. ప్రస్తుతానికి పూజను సురక్షితంగా రక్షించామని, ఆమె కుటుంబ సభ్యులతో పాటు ప్రియుడిని కూడా విచారిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ విపిన్ చౌదరి పేర్కొన్నారు. ప్రేమ వ్యవహారంలో వచ్చిన విభేదాలే ఈ ఆందోళనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us