ఇంట్లో పూజ.. బయట పోలీసులు! ఏడు గంటల తర్వాత తుపాకీ మోతతో ముగిసిన హైడ్రామా!

ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన కాల్పుల ఘటన ఎట్టకేలకు ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. శంభుపూర్ ఘాజీ గ్రామంలో మంగళవారం (సెప్టెంబర్ 22) సాయంత్రం ప్రారంభమైన హై-వోల్టేజ్ డ్రామా దాదాపు ఏడు గంటల పాటు కొనసాగింది. భార్య, పూజారులపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ సింగ్.. తన ముగ్గురు పిల్లలతో కలిసి ఓ గదిలో బంధించుకున్నాడు.

ఇంట్లో పూజ.. బయట పోలీసులు! ఏడు గంటల తర్వాత తుపాకీ మోతతో ముగిసిన హైడ్రామా!
Azamgarh Triple Murder

Updated on: Sep 23, 2026 | 8:08 AM

ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన కాల్పుల ఘటన ఎట్టకేలకు ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. శంభుపూర్ ఘాజీ గ్రామంలో మంగళవారం (సెప్టెంబర్ 22) సాయంత్రం ప్రారంభమైన హై-వోల్టేజ్ డ్రామా దాదాపు ఏడు గంటల పాటు కొనసాగింది. భార్య, పూజారులపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ సింగ్.. తన ముగ్గురు పిల్లలతో కలిసి ఓ గదిలో బంధించుకున్నాడు. పోలీసులు, ఉన్నతాధికారులు అతడిని లొంగిపోయేలా చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చివరకు కమాండోలు రంగంలోకి దిగారు. ఎదురుకాల్పుల్లో అరవింద్ మృతి చెందాడు.

అహ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభుపూర్ ఘాజీ గ్రామానికి చెందిన అరవింద్ సింగ్ మంగళవారం సాయంత్రం మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో పూజ జరుగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూజ నిర్వహిస్తున్న ఇద్దరు పురోహితులను అరవింద్ ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. పూజకు సంబంధించి అతనికి తన భార్యతోనూ వాగ్వాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత అరవింద్ తన లైసెన్స్ ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో అతని భార్య బబితా సింగ్, ఇద్దరు పురోహితులు గాయపడి మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. కాల్పుల శబ్దాలు విని గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో.. అరవింద్ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు. అజంగఢ్ ఎస్పీ డాక్టర్ అనిల్ కుమార్, ఎస్పీ రూరల్ చిరాగ్ జైన్‌తో పాటు ఆరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా నిందితుడిని లొంగిపోవాలని కోరారు. అయితే అతడు స్పందించకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

రాత్రి 11.30 గంటల సమయంలో వారణాసి జోన్ ఏడీజీ నవీన్ అరోరా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత కమాండో బృందం రంగంలోకి దిగింది. లొంగిపోవాలని మరోసారి హెచ్చరించగా.. అరవింద్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అతడు సుమారు ఆరు రౌండ్లు కాల్పులు జరపగా, కమాండోలు ఎదురు కాల్పులు జరిపారు. దాదాపు 15 నిమిషాల పాటు కాల్పులు కొనసాగినట్లు అధికారులు వెల్లడించారు.

కాల్పుల అనంతరం గదిలోకి ప్రవేశించిన కమాండోలకు అరవింద్ గాయాలతో కనిపించాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఓ బాలుడికి కూడా గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

పూజ నిర్వహిస్తున్న పురోహితుడి వాంగ్మూలం ప్రకారం.. ఇంట్లో నాలుగు రోజులుగా పూజ జరుగుతోంది. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పూజ విషయంలో అరవింద్‌కు ముందే అభ్యంతరాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే ఈ కాల్పులకు అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుందని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us