
చికెన్ కర్రీ.. కూర ఎంత కమ్మగా ఉంటుందో.. అంతే గొడవలకు కూడా కారణమవుతుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా తీస్తుంది. తాజాగా.. చికెన్ కర్రీ.. ఒకరి ప్రాణాలు తీయగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయలయ్యాయి. అనుకోకుండా ఓ వ్యక్తిపై చికెన్ కర్రీ పడటంతో గొడవ మొదలైంది.. అది కాస్త.. ఘర్షణగా మారి ఒకరి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది.. ఒలికిపోయిన చికెన్ కర్రీ విషయంలో జరిగిన చిన్న వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారింది. ఈ గొడవలో ఒక వ్యక్తి మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
గోరఖ్‌పూర్ ప్రాంతంలోని సౌరియా అనే గ్రామంలో ఒక వివాహ విందు జరుగుతుండగా ఈ గొడవ మొదలైంది. విందు వడ్డిస్తున్న సమయంలో కొంత చికెన్ కర్రీ ఒక వ్యక్తిపై లేదా కింద వలికినట్లు సమాచారం. ఈ విషయమై అతిథుల మధ్య మాటా మాటా పెరిగింది. వాగ్వాదం కాస్తా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల వారు కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ హింసాత్మక ఘర్షణలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడిని అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాడిలో గాయపడిన మిగిలిన ఆరుగురిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడిని పెళ్లికొడుకు బృందంలో ఉన్న సుమిత్ కుమార్‌గా గుర్తించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వివాహ వేడుకలో జరిగిన ఈ హింసపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గ్రామంలో మళ్లీ గొడవలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. నిందితులను గుర్తించడానికి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. కేవలం చిన్నపాటి కారణానికే ప్రాణాలు తీసే స్థాయికి గొడవ వెళ్లడం స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..