సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

Kishan Reddy vs Priyanka Gandhi: విద్యార్థుల నిరసనలపై ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించిన ఆయన.. తెలంగాణ ఉద్యమం, ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థులపై జరిగిన చర్యలను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించారు.

సొంత చరిత్రను మరిచారా?.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Kishan Reddy Press Statement

Updated on: Jul 28, 2026 | 10:16 PM

జంతర్‌మంతర్‌ దగ్గర విద్యార్ధులను పోలీసులు వేధించారని.. వారేమైనా ఉగ్రవాదులా? అంటూ.. ప్రియాంక గాంధీ లోక్‌సభలో ప్రశ్నించారు. నీట్‌ పేపర్‌ లీక్‌తో ఎంతోమంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ పేర్కొన్నారు. అయితే.. ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రియాంకగాంధీ ఇలాంటి ప్రశ్నలు అడిగే ముందు కాంగ్రెస్ పార్టీ తన సొంత చరిత్రను ఒక్కసారి గుర్తుచేసుకోవాలని ఆయన సూచించారు.

1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో.. తెలంగాణ కోసం పోరాడిన 369 మంది విద్యార్థులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు కాల్పుల్లో దారుణంగా కాల్చి చంపిందని.. మరి అప్పట్లో ఆ విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులుగా భావించిందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో.. కాంగ్రెస్ పార్టీ వంచన, ఆలస్యం, ద్రోహం కారణంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1,200 మంది విద్యార్థులు, యువకులు తమ ప్రాణాలను అర్పించారన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ ముందు ప్రాణ త్యాగం చేసిన యాదిరెడ్డితో సహా ఎందరో విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించారు. వారి ఆవేదన కాంగ్రెస్‌కు కనిపించలేదా? అని ప్రశ్నించారు.

ఎమర్జెన్సీ సమయంలో.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గళమెత్తిన వేలాది మంది విద్యార్థులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెట్టి హింసించింది. నిరసన తెలిపిన ప్రతి గొంతునూ క్రూరంగా అణచివేసింది. ప్రియాంక గాంధీ ఈ చీకటి అధ్యాయాల గురించి ఎప్పుడూ చదవలేదా? లేదా తన నానమ్మను ఎప్పుడూ అడగలేదా? ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ఆ విద్యార్థులంతా కాంగ్రెస్ దృష్టిలో ఉగ్రవాదులా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

అధికారం లేనప్పుడే కాంగ్రెస్‌కు చరిత్ర గుర్తుకొస్తుంది:

అధికారం పోయినప్పుడు మాత్రమే కాంగ్రెస్‌కు చరిత్ర, హక్కులు గుర్తుకొస్తాయని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా విద్యార్థులపై లాఠీఛార్జీలు, కాల్పులు, అరెస్టులు, ప్రజాస్వామ్య గొంతులను తొక్కిపెట్టడమే దాని వారసత్వంగా మారిందని మండిపడ్డారు.

ప్రియాంక గాంధీ వ్యాఖ్యలు చేసేముందు వాస్తవాలను తెలుసుకుంటే మంచిదని కిషన్ రెడ్డి ప్రకటనలో తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us