దేశంలో మరోసారి కరోనా వికృతరూపం.. చిన్నపాటి లక్షణాలు ఉన్నా కరోనా పరీక్ష.. టెస్టులు రెట్టింపు చేసిన ఆరోగ్య శాఖ

|

Nov 18, 2020 | 3:00 PM

దేశంలో మరోసారి కరోనా వికృత రూపం దాల్చుతోంది. అత్యధిక కేసుల జాబితాలో ఉన్న దేశ రాజధాని దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది.

దేశంలో మరోసారి కరోనా వికృతరూపం.. చిన్నపాటి లక్షణాలు ఉన్నా కరోనా పరీక్ష.. టెస్టులు రెట్టింపు చేసిన ఆరోగ్య శాఖ
Follow us on

దేశంలో మరోసారి కరోనా వికృత రూపం దాల్చుతోంది. అత్యధిక కేసుల జాబితాలో ఉన్న దేశ రాజధాని దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. ఈ నేపధ్యంలో ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ కరోనా కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. ఢిల్లీలో రాబోయే రెండువారాలు అత్యంత కీలకమైనవని భావించిన ఆరోగ్యశాఖ ప్రస్తుత పండుగ రోజుల్లో కరోనా టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని నిర్ణయించింది. అదేవిధంగా ఏ విధమైన ఫ్లూ లక్షణం కనిపించినా వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచించింది. ఈ విషయమై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో సెప్టెంబరులో ప్రతీరోజూ 57 వేల వరకూ కరోనా టెస్టులు చేశామని, ఇప్పుడు ఈ సంఖ్యను రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఏ చిన్నపాటి కరోనా లక్షణం కనిపించినా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నామన్నారు. దగ్గు, జ్వరం, గొంతు సంబంధిత సమస్యలు కలిగినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలన్నారు. మరోసారి ఢిల్లీ వ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నామన్న ఆయన.. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా బాధితుల కోసం 3,523 పడకలు ఉన్నాయన్నారు. వీటిని రాబోయే ఐదారు రోజుల్లో అదనంగా ఆరు వేలకు పెంచనున్నామని అన్నారు. అలాగే, కంటైన్మెంట్ జోన్‌లలో ఇంటింటి సర్వే నిర్వహించి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం త్వరలో మొబైల్ ల్యాబ్ ఏర్పాటు కానున్నదని పేర్కొన్నారు. రెండో దఫా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండా రాజేష్ భూషణ్ సూచించారు.