
ఢిల్లీలో మరోసారి TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2025 సందడి మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. ప్రతి ఏటా నిర్వహించే ఈ వేడుక ఈసారి మరింత గ్రాండ్‌గా జరగనుంది. మ్యూజిక్, డ్యాన్స్, రుచికరమైన ఆహారంతో ఈ ఉత్సవం ప్రేక్షకులను అలరించనుంది. ముఖ్యంగా నవరాత్రి శుభ సందర్భంగా ఈ పండుగ ప్రారంభం కావడం విశేషం. సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమయ్యే ఈ పండుగ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న న్యూ మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ ఉత్సవం అక్టోబర్ 2 వరకు ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. నవరాత్రి, దుర్గా పూజ, దసరా పండుగలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
TV9 ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో సంగీత ప్రియులను ఆకట్టుకునేలా లైవ్ మ్యూజిక్, DJ నైట్స్ ప్రజలను ఆకట్టుకోనున్నాయి. నవరాత్రి సందర్భంగా దాండియా నైట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాకుండా ఈ ఉత్సవంలో దుర్గా పూజ కోసం ప్రత్యేకంగా భారీ పండాల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది భక్తి, విశ్వాసం, శక్తిని ప్రతిబింబిస్తుంది. ఈ ఉత్సవానికి వచ్చే సందర్శకులకు షాపింగ్ చేసే అవకాశం కూడా ఉంది. లైఫ్ స్టైల్ ఎక్స్‌పోలో భారతీయ, అంతర్జాతీయ ఫ్యాషన్, కళలు, ఆభరణాలు, గృహోపకరణాలు, టెక్నాలజీ ఉత్పత్తులు ప్రదర్శించనున్నారు. ఫుడ్ లవర్స్ కోసం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేక వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఆనందించడానికి అనేక రకాల వినోద కార్యక్రమాలు, పోటీలు ఉంటాయి.
TV9 నెట్‌వర్క్ యొక్క సీవోవో విక్రమ్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల ఉత్సవాల విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈసారి ఈ పండుగను మరింత అద్భుతంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈసారి లైవ్ మ్యూజిక్, సెలబ్రిటీ దాండియా నైట్స్, దుర్గా పూజ వేడుకలతో సందడి మరింత పెంచనున్నట్లు తెలిపారు. లైఫ్ స్టైల్ స్టాల్స్‌లో అంతర్జాతీయ బ్రాండ్‌లను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
ఈ ఉత్సవం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. లైఫ్ స్టైల్ ఎక్స్‌పోకు ప్రవేశం ఉచితం. సంగీతం, ఇతర కార్యక్రమాల టికెట్‌లను BookMyShow వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. ఈ పండుగ గురించి మరింత సమాచారం కోసం www.tv9festivalofindia.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.