
మండుటెండల్లో దాహం.. దాహం అంటున్న ఢిల్లీ వాసులకు కరెంట్ కోతలు నరకం చూపిస్తున్నాయి. యూపీలో పవర్‌గ్రిడ్ ఫేయిల్ కావడంతో దేశ రాజధానిలో చాలా చోట్ల కరెంట్ లేదు. నీటి ఎద్దడితో పాటు కరెంట్ కోతల కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీని డబుల్ ట్రబుల్ వెంటాడుతోంది. ఓవైపు తీవ్ర నీటి కొరత, ఎండలతో తల్లడిల్లుతున్న హస్తినవాసులకు కరెంట్ కోతలు నరకం చూపిస్తున్నాయి. ఢిల్లీలో కరెంట్ కోతలతో జనం పరేషాన్ అవుతున్నారు. యూపీ లోని పవర్‌గ్రిడ్‌లో సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీకి కరెంట్ కష్టాలు వచ్చాయి. తాగునీటి కోసం కూడా ఢిల్లీ ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. హర్యానా మంచినీటిని విడుదల చేయడం లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా హర్యానా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే కేంద్రం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆప్ మంత్రి అతిషి డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మండోలాలోని పీజీసీఐఎల్ సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. అక్కడ నుంచి ఢిల్లీకి 1,500 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతుంది. అగ్నిప్రమాదంతో సబ్ స్టేషన్ కాలిపోవడంతో ఢిల్లీకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఢిల్లీలో తీవ్రమైన ఎండలు ఉన్నాయి. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఓ వైపు ఎండలు.. ఇంకోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉక్కపోతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తక్షణమే కరెంట్ కోతలను నివారించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆప్ మంత్రి అతిషి స్పందించారు. కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని వెల్లడించారు. ఢిల్లీలో కరెంట్ డిమాండ్ 8 వేల మెగావాట్లకు చేరింది. ఢిల్లీ ప్రభుత్వంతో లెఫ్టినెంట్ గవర్నర్ ఘర్షణ వైఖరి కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమయ్యిందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈవిషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోకపోతే ఢిల్లీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందున్నారు. గత రెండు నెలల నుంచి ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…