
బయో-మెట్రిక్ అటెండెన్స్ కోసమో లేక ఆన్‌లైన్ క్లాసుల కోసమో కొండలు, చెట్లు ఎక్కి మొబైల్ నెట్‌వర్క్ కోసం తంటాలు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు.. లేక ఇంటర్నెట్ ఆధారిత సేవలు అందుకోవడం కోసం తంటాలు పడుతున్న సామాన్యుల దృశ్యాలు భారత్‌లో అనేక చోట్ల కనిపిస్తుంటాయి. ఇందుక్కారణం ప్రపంచం హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌తో పరుగులు తీస్తుంటే.. కొన్ని ప్రాంతాల్లో సాధారణ స్పీడ్ ఇంటర్నెట్ కూడా లభించకపోవడమే. నేటి ప్రపంచంలో విద్య, వైద్యం సహా అనేక రకాల సేవలను ఇంటర్‌నెట్ ద్వారా అందిస్తోంది. ప్రభుత్వాలు సైతం నిజమైన లబ్దిదారులకు ఫలాలు అందించే క్రమంలో ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేస్తూ వారి ఖాతాల్లోకి నిధులు బదిలీ చేస్తోంది. ఇలాంటి సేవలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం తప్పనిసరిగా మారింది. కానీ గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నేటికీ హై-స్పీడ్ ఇంటర్నెట్ అన్నది అందని ద్రాక్షగానే మారింది. ఇప్పుడు ఆ పరిస్థితికి చెక్ పెట్టే సరికొత్త పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది.
ఇప్పటి వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (OFC) ద్వారా వచ్చే ఇంటర్నెట్ లేదంటే 5G మొబైల్ టవర్ల ద్వారా మాత్రమే అందుతోంది. అయితే ఇప్పటికే భారత్‌లో అనేక మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. కనీసం 4G సేవలు సైతం అందుకోలేని గ్రామాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడానికి వెసులుబాటు లేకుండా పోతోంది. పోనీ అలాంటి ప్రాంతాలకు OFC కేబుళ్లు లేదా 5G మొబైల్ టవర్లు వేయాలంటే.. ఖర్చు తడిసి మోపెడవుతుంది. అక్కడ ఉన్న వినియోగదారుల సంఖ్యతో పోల్చితే పెట్టే ఖర్చు అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ఈ తరహా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు రావడం లేదు. కానీ ఇప్పుడు ఎలాంటి OFC కేబుళ్ల జంజాటం లేకుండా, టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేకుండా నేరుగా ఆకాశం నుంచి అందే సిగ్నల్ ద్వారా హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ చేపట్టిన స్టార్‌లింక్ ప్రాజెక్టు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల టెస్ట్ రన్ పూర్తి చేసుకుంది. అవన్నీ విజయవంతమయ్యాయి. నేరుగా ఆకాశం నుంచి (శాటిలైట్ ద్వారా) అందే సిగ్నల్ ద్వారా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ అందుతోంది. ఈ సేవలను భారత్‌లోని మారుమూల ప్రాంతాలకు విస్తరించేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆ క్రమంలో స్టార్‌లింక్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు సైతం చేసుకుంటున్నాయి. వాటిలో మహారాష్ట్ర ముందు వరుసలో నిలుస్తోంది.
మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం ద్వారా స్టార్‌లింక్ అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. చివరి మైలు వరకు కనెక్టివిటీని అందించడంలో ఉన్న అంతరాలను ఈ ప్రాజెక్టు పూరిస్తుంది. గ్రామీణ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ సౌకర్యాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో స్టార్‌లింక్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి వీరేంద్ర సింగ్ ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ (LOI)పై సంతకం చేశారు. డిజిటల్ మహారాష్ట్ర మిషన్‌లో భాగమైన ఈ ప్రాజెక్ట్, స్టార్‌లింక్ భారత ప్రభుత్వం నుంచి అన్ని నియంత్రణ అనుమతులను పొందిన తర్వాత కొనసాగుతుంది.
రాష్ట్రంలోని అన్ని గ్రామాలను, అన్ని పాఠశాలలను, అన్ని ఆరోగ్య కేంద్రాలను, అవి ఎంత మారుమూల ప్రాంతాలైనా సరే హై-స్పీడ్ ఇంటర్నెట్‌తో అనుసంధానించడంలో ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ గిరిజన ప్రాంతాలు, తీరప్రాంత మండలాలు, విపత్తు నియంత్రణ కేంద్రాలు, అటవీ కేంద్రాలు, ఓడరేవులు వంటి ఇతర కీలక మౌలిక సదుపాయాలకు కనెక్టివిటీని అందిస్తుంది.
మహారాష్ట్రలో మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న గడ్చిరోలితో పాటు నందూర్బార్, ధరాశివ్, వాషిమ్ వంటి జిల్లాలు మొదటి దశలో ఉన్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా 90 రోజుల పాటు ఈ జిల్లాల్లో అమలు చేస్తారు. ఇందుకోసం ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్ట్ అమలు తీరుతెన్నులు పరిశీలిస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తారు. పైలట్ దశలో ప్రభుత్వ గిరిజన పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు) అనుసంధానం చేయనున్నారు. ఇది విపత్తు ప్రతిస్పందన కమ్యూనికేషన్లతో పాటు తీర నిఘా నెట్‌వర్క్‌లను కూడా మెరుగుపరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భాగస్వామ్యం లేని ప్రాంతాలలో విశ్వసనీయ ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా విద్య, ఆరోగ్యం, లోకల్ గవర్నెన్స్ మెరుగుపడుతుందని సర్కారు అంచనా వేస్తోంది. లైవ్ స్ట్రీమింగ్, టెలీ-మెడిసిన్, ఆన్‌లైన్ లెర్నింగ్ వంటి సేవలతో పాటు అత్యవసర సమయాలు, విపత్తుల్లో మద్దతు ఇవ్వగల డిజిటల్ మౌలిక సదుపాయాలను స్టార్‌లింక్ ప్రాజెక్ట్ అందజేస్తుంది. భవిష్యత్తులో దీనిని సాధించవచ్చని రాష్ట్రం విశ్వసిస్తుంది.
ఇంటర్‌నెట్ విప్లవం ప్రపంచవ్యాప్తంగా సమూల మార్పులు తీసుకొచ్చింది. అనేక సేవలను సులభతరం చేసింది. అనేక మందికి సరికొత్త ఉపాధిని సృష్టించింది. ప్రజల్లో దాగిన విశిష్ట ప్రతిభ, నైపుణ్యాలను ప్రపంచానికి చాటింది. ఇప్పుడు ఆ ఇంటర్నెట్ విప్లవంలో మరో ముందడుగుగా చెప్పుకునే స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో త్వరలో ప్రారంభం కావడం సరికొత్త విప్లవంగా చెప్పుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..