Mohanlal – Guruvayur Temple: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. కేరళ గురువాయూర్‌లోని శ్రీకృష్ణ ఆలయ దర్శనం కోసం వెళ్లిన మోహన్ లాల్‌కు ఆలయ అధికారులు స్పెషల్ ట్రీట్మెంట్ కల్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన కారును నిబంధనలకు విరుద్ధంగా ఆలయ ఎంట్రెన్స్ వరకు అనుమతించడం వివాదానికి కారణమవుతోంది. సాధారణంగా భద్రతా అధికారులతో పాటు అత్యున్నత పదవుల్లోని వీఐపీల వాహనాలు మాత్రమే గురువాయూర్ ఆలయ ఎంట్రెన్స్ వరకు వెళ్లేందుకు అనుమతిస్తారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ నెల 7న(గురువారం) మోహన్ లాల్ కారు అక్కడ వరకు వెళ్లేందుకు అనుమతించారు. ఎలాంటి రాజ్యాంగ పదవుల్లో లేని మోహన్ లాల్ కారును అక్కడి వరకు ఎలా అనుమతించారని ఆలయ అధికారులను కొందరు భక్తులు ప్రశ్నిస్తున్నారు. సామాన్య భక్తులను ఇబ్బందులకు గురిచేస్తూ వీఐపీల సేవల్లో ఆలయ అధికారులు తరిస్తున్నారని.. వీఐపీలకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చే చెడు సాంప్రదాయాన్నిఆలయ అధికారులు కొనసాగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
మోహన్ లాల్‌కు ప్రత్యేక గౌరవం కల్పించినట్లు తమపై వస్తున్న విమర్శల దాడిని ఎదుర్కొనేందుకు గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని ఆలయ అధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు మోహన్ లాల్ కారు ఆలయ ఎంట్రెన్స్ వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బందికి ఆలయ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. కారు ఆలయ ఎంట్రెన్స్ వరకు వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా గేట్లు తెరిచి అనుమతించినట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ కారుకు గేట్లు తెరిచేందుకు ఎవరి అనుమతులు పొందారు? దీనికి కారణాలు ఏంటో? తెలియజేయాలని సెక్యూరిటీ సిబ్బందికిచ్చిన షోకాజు నోటీసులో అధికారులు ఆదేశించారు.
అయితే ఆలయ ధర్మకర్తల మండలిలోని ముగ్గురు సభ్యులు మోహన్ లాల్ వెంట ఉన్నందునే ఆయన కారును లోనికి అనుమతించామని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు.
గురువాయూర్ ఆలయంలో వీఐపీలకు ప్రత్యేక గౌరవం కల్పించడంపై చాలా కాలంగా విమర్శలు ఉన్నాయి. దీనిపై కొందరు భక్తులు కేరళ హైకోర్టును కూడా ఆశ్రయించగా.. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మోహన్ లాల్ కారు వ్యవహారం ఆలయ అధికారులకు ఇబ్బందికరంగా పరిణమించింది. వీఐపీలకు ప్రత్యేక గౌరవం కల్పించడం లేదని చాటేందుకే మోహన్ లాల్ కారును ఆలయ ఎంట్రన్స్ వరకు అనుమతించిన సెక్యూరిటీ సిబ్బందికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. తద్వారా ఈ వివాదంలో తమ ప్రమోయం లేదని చేయి దులుపుకునేందుకు ఆలయ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Also Read..
నా భర్తను వెంటనే ఆఫీసుకు పిలవండి.. లేకపోతే మేము డైవర్స్ తీసుకుంటామేమో అంటూ ఓ ఉద్యోగి భార్య ఆవేదన
Ganesh Immersion: ఒకవైపు హైకోర్టు.. మరోవైపు భక్తులు. ఇద్దరి మధ్యా నలిగిపోతోన్న టీ సర్కారు