సోనం వాంగ్‌చుక్ 26 రోజుల నిరాహార దీక్షకు విరమణ.. కేంద్రంతో చర్చలు ఫలిస్తాయా?

నీట్ (NEET-UG) పరీక్షలో అక్రమాలు, పేపర్ లీక్ ఘటనలకు నిరసనగా 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యా సంస్కరణల ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ తన దీక్షను విరమించారు. గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జె.పి. నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో ఉపవాసాన్ని ముగించారు. కేంద్ర ప్రభుత్వ హామీల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన వాంగ్‌చుక్, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు..

సోనం వాంగ్‌చుక్ 26 రోజుల నిరాహార దీక్షకు విరమణ.. కేంద్రంతో చర్చలు ఫలిస్తాయా?
Sonam Wangchuk Withdraws Hunger Strike

Updated on: Jul 24, 2026 | 7:09 AM

న్యూఢిల్లీ, జులై 24: నీట్‌ (NEET-UG) పరీక్షలో జరిగిన అక్రమాలు, పేపర్ లీక్ ఘటనలపై నిరసనగా గత 26 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ సామాజిక వేత్త సోనం వాంగ్‌చుక్ శుక్రవారం (జులై 23) తన దీక్షను విరమించారు. గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో కేంద్ర ఆరోగ్య మంత్రి JP నడ్డా, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమక్షంలో ఆయన ఉపవాసాన్ని విరమించారు. ఆరోగ్యం క్షీణించడంతో వాంగ్‌చుక్ మెడాంటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం దీక్ష విరమించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తన ఎక్‌ ఖాతాలో వాంగ్‌చుక్ వెల్లడించారు. తాను ఎందుకు దీక్షను ముగించాననే విషయంపై త్వరలో ప్రత్యేక వీడియో విడుదల చేస్తానని అందులో పేర్కొన్నారు. అలాగే దేశంలో ఎక్కడా హింసకు తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘కేంద్ర మంత్రులు JP నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్, లేహ్-లడఖ్ అపెక్స్ బాడీ నాయకుల సమక్షంలో 26 రోజుల తర్వాత నా నిరాహార దీక్షను ముగించాను. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 65 మంది ఎంపీలు ప్రత్యక్షంగా వచ్చి లేదా లేఖల ద్వారా దీక్ష విరమించాలని కోరారు’ అని వాంగ్‌చుక్ తన పోస్టులో పేర్కొన్నారు.

జూన్ 28న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్న అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ప్రారంభించారు. తొలుత ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయనను.. మెడాంటా ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన భార్య గీతాంజలి అంగ్మో దాఖలు చేసిన పిటిషన్ మేరకు ఆయనను మెడాంటా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కూడా వాంగ్‌చుక్ దీక్షను విరమించాలని కోరారు. దేశానికి మీ అవసరం ఉంది. మీ జీవితం ఎంతో విలువైనది అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

మరోవైపు నీట్ పేపర్ లీక్ అంశంపై కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) దేశవ్యాప్తంగా శుక్రవారం నిరసనలకు పిలుపునిచ్చింది. చర్చలకు రావాలని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినప్పటికీ, నిరసన జరుగుతున్న జంతర్ మంతర్ వద్దకు కేంద్ర మంత్రులే రావాలని సీజేపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పేపర్ లీక్ కేసులన్నింటినీ ఫాస్ట్‌ట్రాక్‌లో విచారించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని గురువారం (జులై 23) అర్ధరాత్రి విడుదల చేసిన సెల్ఫీ వీడియో ద్వారా హామీ ఇచ్చారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మోదీ స్పష్టం చేశారు.

Follow Us