కోర్టు హాల్లో ఓ కేసు విచారణ సమయంలో పాము ప్రత్యక్షం కావడం కలకలంరేపింది. దీంతో అక్కడనున్న వారందరూ భయంతో వణికిపోయారు. ముంబైలో ములుంద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్టులోని రూమ్ నెంబర్.27లో కోర్టు కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో ఫైళ్లకు మధ్య దాదాపు 2 అడుగుల పొడవున్న పాము కనిపించింది.
పాము కనిపించడంతో కోర్టు రూమ్‌లో ఉన్న అందరూ భయాందోళనకు గురైనట్లు ఓ న్యాయవాది తెలిపారు. జడ్జి కోర్టు కార్యకలాపాలను కాసేపు తాత్కాలికంగా వాయిదావేశారు. స్నేక్ క్యాచర్‌ను పిలిపించి పాము కోసం కోర్టు హాల్ అంతటా గాలించినా ఫలితం లేకపోయింది. పాత ఫైళ్లను తొలగించి చాలా సేపు గాలించినా కోర్టు హాల్లో పామును గుర్తించలేకపోయారు. గదిలోని రంధ్రం నుంచి పాము బయటకు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. గంట సేపటి తర్వాత కోర్టు కార్యకలాపాలను జడ్జి మళ్లీ ప్రారంభించారు.
కాగా కోర్టు ఆవరణలో పాములు కనిపించడం ఇదే తొలిసారి కాదని న్యాయవాదులు తెలిపారు. కోర్టు రూమ్ కిటికీపై సోమవారంనాడు కూడా ఓ పాము కనిపించినట్లు తెలిపారు. రెండు మాసాల క్రితం జడ్జి ఛాంబర్‌లో ఓ పాము కనిపించినట్లు వెల్లడించారు. కోర్టు ఆవరణలో పచ్చని చెట్లు ఎక్కువగా ఉన్నందున పాములు వస్తున్నట్లు ఓ న్యాయవాది తెలిపారు.