భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బంగారం అక్రమ రవాణా పథకం బెడిసికొట్టింది. 16.7 కేజీల బంగారంతో స్మగ్లర్‌ను సరిహద్దు రక్షకులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన బంగారం మార్కెట్ విలువ 10.23 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని రాణాఘాట్ వద్ద విధులు నిర్వహిస్తున్న 68 బెటాలియన్ జవాన్లకు భారీ మొత్తంలో బంగారం స్మగ్లింగ్ జరుగుతుందని పక్కా సమాచారం అందింది. సహజంగానే నిఘా పెరిగింది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో అనుమానాస్పద బైక్ రైడర్‌ను జవాన్లు గుర్తించారు. జవాన్లు బైక్ రైడర్‌ను ఆపి విచారించారు. ఆ తర్వాత సోదా చేయగా యువకుడి నడుముకు కట్టిన బెల్టు నుంచి 17 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సైనికులు బైక్ బైక్ రైడర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఈ బంగారాన్ని భారత్‌కు తీసుకురావడానికి స్మగ్లర్ ప్రయత్నిస్తున్నట్టుగా జవాన్లు నిర్ధారించారు.
నిందితుడి పేరు అజరు మండల్ అని తెలిసింది. వయస్సు 27 సంవత్సరాలు. అతను ఉత్తర 24 పరగణాస్‌లోని రాజ్‌కోల్ నివాసి అని తేలింది. విచారణలో పట్టుబడిన యువకుడు నిరుపేదవాడని చెప్పాడు. పూల సాగు చేస్తూ జీవనం సాగించేవాడు. ఆరు నెలల క్రితం అక్రమ రవాణాకు పాల్పడ్డాడు. బంగ్లాదేశ్‌లోని మతిలా గ్రామానికి చెందిన ఆలం మోండల్ నుంచి యువకుడు ఈ వస్తువులను తీసుకు వచ్చినట్టుగా చెప్పాడు. వాటిని బంగావ్‌లోని మరొక స్మగ్లర్‌కు అందించనున్నట్టు పట్టుబడిన వ్యక్తి చెప్పాడు. అయితే దారిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది సోదాల్లో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్, స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తదుపరి చట్టపరమైన చర్యల కోసం కోల్‌కతాలోని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.
గతంలో కూడా 23 కిలోల బంగారంతో స్మగ్లర్‌ను పట్టుకున్నారు..
సెప్టెంబరు నెలలో కూడా రాంఘట్ సరిహద్దు పోస్ట్‌లో సైనికులు 23 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓ స్మగ్లర్ కూడా పట్టుబడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకు సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ 150 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. సైనికుల ఈ ఘనత పట్ల BSF సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డిఐజి శ్రీ ఎకె ఆర్య సంతోషం వ్యక్తం చేశారు. పేరెన్నికగన్న స్మగ్లర్లు తక్కువ మొత్తంలో డబ్బు ఎర చూపి పేద, అమాయకులను ఉచ్చులోకి నెడుతున్నారని చెప్పారు. పేరుమోసిన స్మగ్లర్ల ముఠా నేరుగా స్మగ్లింగ్ వంటి నేరాలలో పాల్గొనదు. అందుకే వారు పేద ప్రజలను లక్ష్యంగా చేసుకుంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..