Sinclair CEO: సిన్క్లేర్ సీఈఓ చేతుల మీదుగా ఇండియా డిజైన్ చేసిన చిప్ ఆవిష్కరణ

సెమికాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్‌కు ముందు, అమెరికాకు చెందిన సిన్క్లేర్ సంస్థ భారతదేశంలో తయారైన డైరెక్ట్ టు మొబైల్ (D2M) చిప్‌ ఆధారిత టాబ్లెట్‌ను ప్రదర్శించింది. ఈ చిప్‌ను సాంక్య ల్యాబ్స్ అభివృద్ధి చేయగా.. ఇది ఇంటర్నెట్ లేకుండానే టీవీ ప్రసారాలను నేరుగా మొబైల్ ఫోన్‌లకు అందించగలిగే ప్రపంచంలోనే మొదటి టెక్నాలజీ.

Sinclair CEO: సిన్క్లేర్ సీఈఓ చేతుల మీదుగా ఇండియా డిజైన్ చేసిన చిప్ ఆవిష్కరణ
Sinclair CRO Chris Ripley

Updated on: Sep 01, 2025 | 8:24 PM

న్యూఢిల్లీలో సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు జరుగనున్న సెమికాన్ ఇండియా 2025 కాన్ఫరెన్స్‌కి ముందు భారత్ టెక్నాలజీ రంగంలో గర్వపడేలా ఓ కీలక ఆవిష్కరణ జరిగింది. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ Sinclaire సీఈఓ తాజాగా ఒక టాబ్లెట్‌ను ప్రదర్శించారు. ఆ టాబ్లెట్ పూర్తిగా భారతదేశంలో రూపుదిద్దుకున్న డైరెక్ట్ టు మొబైల్ (D2M) చిప్ ఆధారంగా పనిచేస్తోంది.

ఈ టాబ్లెట్‌లో వాడిన చిప్‌ను సాంక్య ల్యాబ్స్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఈ సంస్థ, ఐఐటీ కాన్పూర్‌లో ప్రారంభమై.. ప్రస్తుతం టేజస్ నెట్‌వర్క్స్ అనుబంధంగా కొనసాగుతోంది. చిప్‌లో ఉపయోగించిన ప్రుత్వి-3 ATSC 3.0 చిప్‌సెట్ భారత శాస్త్రవేత్తల తేజస్సుకు గొప్ప ఉదాహరణ. D2M టెక్నాలజీ ఉపయోగించి వినియోగదారులు వైఫై లేదా మొబైల్ ఇంటర్నెట్ అవసరం లేకుండా మొబైల్ ఫోన్లలో నేరుగా టెలివిజన్ ప్రసారాలను పొందవచ్చు. ఇదే కాకుండా ప్రభుత్వ సమాచారాన్ని, అత్యవసర సమాచారం, మల్టీమీడియా కంటెంట్ వంటి విషయాలను కూడా నేరుగా ప్రజల ఫోన్లకు పంపించవచ్చు.

ఈ టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటి సారి భారత్‌లో అభివృద్ధి అయింది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, అమెరికాలో ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. సాంక్య ల్యాబ్స్ అందులో భాగంగా Mark One అనే D2M స్మార్ట్‌ఫోన్ రిఫరెన్స్ డిజైన్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. దీనితో పాటు, USB డాంగిల్స్, టీవీకి కనెక్ట్ అయ్యే ఫీచర్ ఫోన్లు, ఇతర పరికరాలు కూడా తయారు చేస్తున్నారు.

ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసేందుకు HMD Global, Lava వంటి మొబైల్ తయారీదారులతో సాంక్య ల్యాబ్స్ కలిసి పని చేస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, అత్యవసర పరిస్థితులలో ఇంటర్నెట్ లేకుండానే సమాచారాన్ని అందించడానికి ఇది భవిష్యత్ పరిష్కారంగా మారనుంది.

భారతదేశం నుంచి వెలువడిన ఈ సాంకేతికత ఇప్పుడు అమెరికా మార్కెట్లకు చేరింది. ఇది ‘డిజైన్ ఇన్ ఇండియా’కు నూతన దిశను చూపించే మార్గం. దేశీయంగా అభివృద్ధి చేసిన చిప్‌లు, ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినియోగం కోసం సిద్ధంగా ఉన్నాయి. భారతదేశం ఇప్పుడిప్పుడే టెక్నాలజీ దిగ్గజంగా మారుతోందనటానికి ఇది నిదర్శనం. సాంకేతిక రంగంలో భారత్ తనదైన ముద్ర వేస్తోందని ప్రపంచం గమనిస్తోంది.