
తమిళనాడులో వాణిజ్య సంస్థలు, నగల దుకాణాలే లక్ష్యంగా వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మదురైలోని టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ తనిష్క్ జ్యువెలరీ షోరూంలో భారీ చోరీ జరిగింది. గత 15 రోజుల క్రితమే ఇక్కడ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు దీపావళి సేల్స్ కోసం భారీ ఎత్తున బంగారు ఆభరణాలను షోరూంలో ఉంచారు. ఇదే అదునుగా భావించిన దొంగలు బుధవారం అర్ధరాత్రి షోరూం షట్టర్‌ను బద్దలుకొట్టి లోపల ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లారు.
ఇక దొంగతనం విషయాన్ని షోరూం నిర్వాహకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు గుర్తించారు. ఆపై దుకాణంలో ఉంచిన 35 కేజీలకు పైగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. చోరీకి గురైన బంగారం దాదాపు 35 కేజీల వరకు ఉండొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇక భారీ చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్లూస్ టీం సహాయంతో ప్రతి అణువణువునా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. షోరూం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు. ఈ దోపిడీలో ముగ్గురి కంటే ఎక్కువ మంది సభ్యులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.