Farmers Protest: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు చట్టాలను రద్దు చేయాలని.. రైతులు ఏడు నెలలుగా ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ ప్రకటించారు. శనివారం ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతోన్న రైతు ఆందోళన ఏడు నెలలకు చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు ఆందోళనకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. మరో రెండు ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించేందుకు తాము సిద్ధమైనట్లు తికాయత్ పేర్కొన్నారు. జూలై 9న షమ్లీ & భగ్‌పట్ ప్రజలు ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొంటారని, జూలై 10న సింఘు సరిహద్దులోని నిర్వహించనున్నట్లు తికాయత్ పేర్కొన్నారు. ట్రాక్టర్లు కదిలితేనే ఢిల్లీలో ప్రకంపనలు రేగుతాయని.. ఆయన పేర్కొన్నారు.
కాగా.. అరెస్ట్ చేసిన రైతు నేతల్ని తీహార్ జైలుకు పంపండి. లేదంటే గవర్నర్‌ను కలుసుకునే అవకాశం ఇవ్వండంటూ కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంలో ఢిల్లీకి ఎలాంటి చికిత్స చేయాలో తాము ముందు ముందు తెలియజేస్తామని.. పరోక్షంగా కేంద్రాన్ని హెచ్చరించారు. ఇదిలాఉంటే.. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున రైతుల్ని సమీకరించి ట్రాక్టర్ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు రైతు సంఘాలు ప్రణాళికలు చేస్తున్నాయి. జూలై 24న బిజ్నోర్ నుంచి ప్రారంభమయ్యే ట్రాక్టర్ ర్యాలీ ఆరోజు రాత్రి మీరట్ టోల్‌గేట్‌కు చేరుకుంటుందని.. అనంతరం జూలై 25న ఢిల్లీ-ఘాజీపూర్ సరిహద్దును చేరుకుని ఆందోళనకు మద్దతు ఇస్తుందని తికాయత్ తెలిపారు.
కాగా.. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబడుతుండగా.. సవరణలు మాత్రం చేస్తామంటూ.. కేంద్రం పేర్కొంటోంది. ఇప్పటికే కేంద్రం, రైతులు మధ్య పలుమార్లు జరిగిన చర్చలన్నీ విఫలమైన సంగతి తెలిసిందే.
Also Read: