రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తాజాగా బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. జూలైలో తమ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి అమిత్ షా సహా పలువురు అగ్రనేతలు కుట్ర పన్నారని విమర్శించారు. సిరోహి జిల్లాలో నిర్వహించిన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జూలైలో బీజేపీ నేత ధర్మేంద్ర ప్రధాన్ రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్యంగా సమావేశం అయ్యారని అన్నారు. ఆ సమావేశానికి అమిత్ షా హాజరై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల దోయాలని చెప్పారని ఆరోపించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు తాము అనుకూలంగా లేని ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టామని మాట్లాడారని చెప్పారు. బీజేపీ కుట్ర గురించి తమ ఎమ్మెల్యేలు తనకు చెప్పారని వివరించారు. అయితే సీఎం అశోక్ గహ్లోత్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా ఆ రాష్ట్ర బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు గులాబ్ కటారియా ఆయన మాటలను తిప్పికొట్టారు. నిజమేదో, అబద్దమేదో తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముందు మీ పార్టీలోని లుకలుకలను సరి చేసుకోండి ఆ తర్వాత ఇతరులపై ఆరోపణలు చేద్దురు కానీ అంటూ చురక అంటించారు. అయితే జూలైలో రాజాస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ ఫైలెట్ తిరుగుబాటు చేసిన విషయం అందరికి తెలిసిందే.