
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అదుపు తప్పి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య ఘర్షణ రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కువైట్ ఎమిర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాతో ఫోన్లో అత్యవసరంగా చర్చించారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కువైట్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. వీలైనంత త్వరగా చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఆయన ఆకాంక్షించారు.
ఇటీవల కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన దాడిలో ఒక భారతీయ యువకుడు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ, కువైట్ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమిర్‌కు హామీ ఇచ్చారు. అలాగే, కువైట్‌లో ఉన్న లక్షలాది మంది భారతీయ సమాజం భద్రతపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నందుకు ఎమిర్‌కు ధన్యవాదాలు తెలిపారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే వీలైనంత త్వరగా అక్కడ శాంతిని పునరుద్ధరించాలని మోదీ ఆకాంక్షించారు.
మరోవైపు, గత 24 గంటల్లో అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన ‘అపాచీ హెలికాప్టర్’ కూలిపోవడమే దీనికి ప్రధాన కారణం. తమ హెలికాప్టర్‌ను ఇరాన్ డ్రోన్ ఢీకొట్టి కూల్చివేసిందని అమెరికా ఆరోపించగా, ఇరాన్ దీనిని ఖండించింది. దీనికి ప్రతికారంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో యూఎస్ సైన్యం ఇరాన్‌పై వరుస దాడులు ప్రారంభించింది. ఇరాన్‌కు చెందిన కీలక తీర ప్రాంతాలైన ఖేష్మ్ ద్వీపం, హోర్ముజ్, జాస్క్, సిరిక్, బందర్ అబ్బాస్, బుషెహర్‌లలోని సైనిక స్థావరాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంది.అమెరికా దాడులకు ఇరాన్ అంతే వేగంగా బదులిచ్చింది. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ సైన్యం డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది.
ఈ అగ్రరాజ్యాల యుద్ధ కాంక్ష మధ్యప్రాచ్యాన్ని అస్థిరతలోకి నెట్టేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, అక్కడ నివసిస్తున్న భారతీయులను రక్షించడానికి, పరిస్థితిని సమీక్షించడానికి భారత రాయబార కార్యాలయాలు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..