PM Modi: రాజ్యసభకు కొత్తగా నలుగురు నామినేట్.. పార్లమెంటరీ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలన్న ప్రధాని

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఎంపికైన నలుగురికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాల్లో వారు చేసిన కృషిని అభినందించారు. వారి పార్లమెంటరీ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలంటూ ప్రధాని ఒక్కొక్కరి గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

PM Modi: రాజ్యసభకు కొత్తగా నలుగురు నామినేట్.. పార్లమెంటరీ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలన్న ప్రధాని
Pm Modi

Updated on: Jul 13, 2025 | 1:06 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినెట్ చేశారు. గతంలో వారు చేసిన సేవలు.. వారికున్న అనుభవాన్ని దృష్టిలో వారిని ఎంపిక చేశారు.  కసబ్ కేసు ప్రాసిక్యూటర్.. ఉజ్వల్ దేవరావ్ నిగమ్, కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త సదానందన్ మాస్టర్, మాజీ విదేశాంగ కార్యదర్శి.. హర్షవర్ధన్ ష్రింగ్లా, చరిత్రకారులు, రాజకీయ శాస్త్రవేత్త డా.మీనాక్షి జైన్.. రాష్ట్రపతి నామినేట్ చేసినవారిలో ఉన్నారు. గతంలో నామినేట్ చేసిన సభ్యుల పదవీ విరమణంతో మిగిలిపోయిన ఖాళీల భర్తీ సందర్భంగా వీరిని ఎంపిక చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a) ప్రకారం రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కొత్తగా రాజ్యసభకు నామినేట్ అయినవారికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నలుగురి గురించి మోదీ ప్రత్యేక ట్వీట్లు చేశారు.

న్యాయవాద వృత్తి పట్ల ఉజ్వల్ నికమ్‌ చూపిన ఆదర్శప్రాయమైన అంకితభావం, రాజ్యాంగ విలువల పట్ల అచంచలమైన నిబద్ధతను మోడీ ప్రశంసించారు. తన న్యాయవాద వృత్తిలో రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడంతో పాటు సాధారణ పౌరులకు అండగా నిలిచారని కొనియాడారు. ఆయన పార్లమెంటరీ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు.

ఉపాధ్యాయుడిగా, సామాజిక కార్యకర్తగా సదానందన్ మాస్టర్ చేసిన కృషిని ఈ సందర్భంగా మోదీ అభినందించారు. అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేసుకున్నారు. ధైర్యానికి ఆయన ప్రతిరూపం అని చెప్పారు. దేశాభివృద్ధికి ఆయన కొనసాగిస్తున్న స్ఫూర్తిని బెదిరింపులు అడ్డుకోలేకపోయాయన్నారు. రాజ్యసభకు ఎంపికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

దౌత్యవేత్త, మేధావి వ్యూహాత్మక ఆలోచనాపరుడిగా ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా అంటూ మోదీ కొనియాడారు. ఎన్నో ఏళ్లుగా దేశ విదేశాంగ విధానానికి కీలక సాయం అందించారు. ఆయన ప్రత్యేక దృక్పథాలు పార్లమెంటరీ కార్యకలాపాలను బాగా మెరుగుపరుస్తాయని చెప్పారు.

విద్యావేత్తగా, పరిశోధకురాలుగా, చరిత్రకారిణిగా తనకు తానుగా డాక్టర్ మీనాక్షి జైన్ ప్రత్యేకతను చాటుకున్నారని మోదీ. విద్య, సాహిత్యం, చరిత్ర, రాజకీయ రంగాలలో ఆమె చేసిన కృషి విద్యారంగాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ఆమెను రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనందంగా ఉందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..