2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌.. రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి: ప్రధాని మోదీ

2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి పౌరుడు జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాజ్యాంగం దేశ అభివృద్ధికి మార్గదర్శకమని, హక్కులతో పాటు పౌరులు తమ విధులను కూడా బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌.. రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి: ప్రధాని మోదీ
PM Modi

Updated on: Nov 26, 2026 | 10:40 AM

భారత రాజ్యాంగమే దేశ అభివృద్ధికి మార్గదర్శకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతి పౌరుడు జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

రాజ్యాంగ నిర్మాతలకు నివాళులు

1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌తో పాటు రాజ్యాంగ పరిషత్ సభ్యులందరికీ ప్రధాని మోదీ నివాళులర్పించారు. భారతీయ నాగరికత, సంస్కృతీ విలువలను ప్రతిబింబిస్తూనే.. వైవిధ్యభరితమైన దేశానికి ఆధునిక పాలనా వ్యవస్థను అందించిన గొప్ప పత్రం రాజ్యాంగమని పేర్కొన్నారు.

సామాన్య కుటుంబాల్లో పుట్టిన వారు సైతం రాజ్యాంగం కల్పించిన అవకాశాలతో ఉన్నత బాధ్యతలు చేపట్టగలుగుతున్నారని చెప్పారు. తన జీవిత ప్రయాణమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. పేదలకు ఇళ్లు కల్పించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల, ఆయుష్మాన్ భారత్, ముద్ర, పీఎం స్వనిధి వంటి పథకాలు గౌరవం, సమానత్వం, ఆర్థిక న్యాయం వంటి రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాయని వివరించారు.

50 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు..

ప్రపంచ బ్యాంకు నివేదికను ప్రస్తావిస్తూ.. దాదాపు 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని మోదీ తెలిపారు. 101వ, 102వ, 103వ రాజ్యాంగ సవరణల ప్రాధాన్యాన్ని వివరించారు. జీఎస్టీ అమలు, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లు కల్పించడం వంటి నిర్ణయాలను ప్రస్తావించారు.

రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న మొత్తం 22 భాషల్లో ఇప్పుడు రాజ్యాంగం అందుబాటులో ఉందన్నారు. భారతీయ న్యాయ సంహిత ద్వారా శిక్షకు ప్రాధాన్యం ఇచ్చే విధానం నుంచి న్యాయాన్ని అందించే దిశగా నేర న్యాయ వ్యవస్థలో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు.

గత ప్రభుత్వాలపై విమర్శలు

గత ప్రభుత్వాల హయాంలో జరిగిన రాజ్యాంగ సవరణలు, ఎమర్జెన్సీ విధింపు అంశాలపై ప్రధాని విమర్శలు చేశారు. 1951లో చేసిన తొలి రాజ్యాంగ సవరణతో పాటు ఎమర్జెన్సీ సమయంలో తీసుకొచ్చిన 42వ సవరణను ప్రస్తావించారు. గత పాలకులు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలను, ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచారని ఆరోపించారు.

ఆర్టికల్ 356ను పదేపదే ఉపయోగించి ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడాన్ని కూడా తప్పుబట్టారు. 2019లో ఆర్టికల్ 370, 35ఏ రద్దును ప్రస్తావిస్తూ.. జమ్మూకశ్మీర్‌లో చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దినట్లు పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించిందని ఆరోపించిన మోదీ.. ప్రతిపక్షాలు రాజ్యాంగం పట్ల తమ బాధ్యతలను నెరవేర్చడం లేదని విమర్శించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలపైనా ఆందోళన వ్యక్తం చేశారు.

హక్కులతో పాటు బాధ్యతలూ ముఖ్యం

పౌరులకు హక్కులతో పాటు విధులు కూడా ముఖ్యమని ప్రధాని మోదీ గుర్తుచేశారు. స్వచ్ఛ భారత్, జల సంరక్షణ వంటి కార్యక్రమాలు కర్తవ్య భావనకు నిదర్శనమని చెప్పారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రెండు సూత్రాలను ప్రతి ఒక్కరూ మార్గదర్శకంగా తీసుకోవాలని మోదీ సూచించారు. “మన ఆలోచనల్లో ఇండియా ఫస్ట్‌.. మన చర్యల్లో కర్తవ్యం” అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిస్తూ తన సందేశాన్ని ముగించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us