
జమ్ముకాశ్మీర్‌లో ఆపరేషన్ మహదేవ్ కొనసాగుతోంది. పహల్గామ్ దాడి ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్ మహదేవ్ చేపట్టారు. ఇప్పటికే ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడికి కుట్ర పన్నిన సులేమాన్ అలియాస్ ఆసిఫ్, గత ఏడాది సోనామార్గ్ టన్నెల్ పేల్చివేత కుట్రలో పాల్గొన్న జిబ్రాన్, ఉగ్రవాది హమ్లా అఫ్గానీ హతమయ్యారు.
హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్ ఉపయోగించడంతో వెంటనే పారాకమాండోలు అప్రమత్తం అయ్యారు. ఉగ్రవాదుల నుంచి ఒక M4 కార్బైన్ రైఫిల్, ఇతర ఆయుధాలను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. మరికొంతమంది ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్ర దాడి ఘటనకు సులేమాన్ సూత్రధారి అని భద్రతా దళాలు భావిస్తున్నాయి. గతంలో పాకిస్థాన్ సైన్యంలో సులేమాన్ పని చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత లష్కరే తోయిబా కోసం సులేమాన్ పనిచేస్తున్నట్లు సమాచారం.
ఓ వైపు పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరుగుతున్న వేళ పహల్గామ్ ఉగ్రదాడికి కుట్ర పన్నిన ఆసిఫ్ ఎన్‌కౌంటర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటన తరువాత శ్రీనగర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. హర్వాన్-లద్వాస్ ప్రాంతంలో మరికొంతమంది ఉగ్రవాదులు నక్కినట్టు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు భద్రత బలగాలు కూంబింగ్‌ను కొనసాగిస్తున్నాయి.
పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులను కాల్చిచంపారు ఉగ్రవాదులు. TRF ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు పహల్గామ్‌లో మారణహోమానికి పాల్పడ్డారు.