
ఒక ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. సర్లే అని ఆ పోయిన ఫోన్ కోసం వెతుకుతున్న పోలీసులకు మైండ్‌బ్లాంక్ అయ్యే సీన్ ఎదురైంది. ఒక ఫోన్ కోసం వెతుకుతుంటే.. వారికి చోరీకి గురైన 74 ఫోన్లు లభించాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోరీకి గురైన మొబైల్ కోసం వెతుకుతున్న పోలీసులకు 74 మొబైల్స్ దొరికాయి. ఈ మొబైల్స్ అన్నీ చోరీకి గురైనవే కావడం విశేషం. ఈ కేసులో పోలీసులు, సైబర్ బృందం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం కూడా పోలీసులు వెతుకుతున్నారు.
ఉజ్జయిని జివాజిగంజ్ పోలీస్ స్టేషన్‌కు మొబైల్ చోరీపై ఒక ఫిర్యాదు అందింది. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తుండగా, ఫోన్ ఉన్న ప్రదేశం రాజ్‌గఢ్‌లో ఉందని సైబర్ సెల్ ద్వారా సమాచారం అందింది. వెంటనే పోలీసులు అదే ప్రదేశానికి వెళ్లారు. ఆ ఫోన్ తాండి గ్రామానికి చెందిన రత్నేష్ అనే యువకుడి వద్ద ఉండటంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఫోన్ గురించి రత్నేష్‌ను ప్రశ్నించినప్పుడు, తాను నిర్దోషినని, రాజ్‌గఢ్‌లోని ఖిల్చిపురాలో ఉన్న ఫుర్కాన్ టెలికాం నుండి ఈ మొబైల్‌ను కొనుగోలు చేశానని చెప్పాడు. పోలీసులు రత్నేష్‌ను ఫుర్కాన్ టెలికాం వద్దకు తీసుకెళ్లి, దొంగిలించబడిన మొబైల్‌ను అమ్మడం గురించి దాని ఆపరేటర్ ఇర్షాద్‌ను అడిగారు, అయితే అతను ఈ మొబైల్‌ను ఇండోర్‌లోని డాలర్ మార్కెట్ నుండి కొనుగోలు చేశానని కూడా చెప్పాడు.
ఇర్షాద్ దుకాణంలో అమ్ముతున్న ఫోన్‌లను పోలీసులు తనిఖీ చేయగా, బిల్లులు లేదా ఇతర పత్రాలు లేని దాదాపు 74 ఫోన్‌లు దొరికాయి. ఇర్షాద్ నుండి అందిన సమాచారం ప్రకారం, అతను కొన్ని రోజుల క్రితం ఇండోర్ డాలర్ మార్కెట్‌లోని జితేంద్ర వాస్వానీ దుకాణం నుండి 150 దొంగిలించబడిన మొబైల్‌లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ కేసులో పోలీసులు ఇర్షాద్‌ను కూడా అరెస్టు చేశారు. పోలీసులు ఇండోర్‌లోని డాలర్ మార్కెట్ వ్యాపారవేత్త జితేంద్ర వాస్వానీ కోసం వెళ్లగా.. అతను పరారీలో ఉన్నాడు. ఈ మొత్తం కేసులో స్వాధీనం చేసుకున్న మొబైల్స్ నిజమైన యజమానులను గుర్తించే పనిలో ఉన్నామని జివాజిగంజ్ పోలీసులు తెలిపారు. యాజమానులను గుర్తించిన తర్వాత మొబైల్స్‌ను త్వరలో వారికి అందజేస్తామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..