కరోనా వైరస్‌ను జయించిన కొందరిపై బ్లాక్‌ఫంగస్ దాడి చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేసినా కూడా పూర్తి స్థాయిలో నయం అవుతుందన్న గ్యారంటీ లభించడం లేదు. అలాంటి ఘటన తాజాగా మహారాష్ట్రలో జరిగింది. నాగ్‌పుర్‌లో గవర్నమెంట్ ఎంప్లాయిగా పనిచేస్తున్న నవీన్ పాల్‌కు గత ఏడాది సెప్టెంబర్‌లో బ్లాక్‌ఫంగస్ సోకింది. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి రూ.1.48 కోట్లు ఖర్చు అయ్యాయి.
కరోనా నుంచి కోలుకున్న కొద్ది రోజులకు పాల్‌కు కళ్ల సమస్య మొదలైంది. చికిత్స కోసం నాగ్‌పుర్, హైదరాబాద్‌లోని డాక్టర్లను సంప్రదించాడు. రెండు నెలలు గడిచినా ఎలాంటి ఫలితం లేకపోయింది. పాల్‌కు వచ్చిన సమస్యను డాక్టర్లు గుర్తించలేకపోయారు. దీంతో నవంబరులో పాల్ ముంబైలోని హిందుజా ఆస్పత్రిలో చేరాడు. బ్లాక్‌ఫంగస్ సోకినట్లు గుర్తించిన వైద్యులు చికిత్సను ప్రారంభించారు. ముంబైలోని హిందూజా ఆస్పత్రి డాక్టర్లు అతనికి మూడు శస్త్రచికిత్సలు చేశారు. మెడిసిన్, ఇన్జెక్షన్ల ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోవడం వల్ల నవీన్ పాల్.. నాగ్పుర్లోనే చికిత్స తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. డిసెంబరులో నాగ్‌పుర్ చేరుకున్న పాల్.. అతని భార్య రైల్వే ఉద్యోగి కావడం వల్ల స్థానిక రైల్వే ఆస్పత్రిలో చేరాడు. అక్కడి డాక్టర్లు పాల్ ఎడమ కన్ను సహా ఇన్ఫెక్షన్కు గురైన నోటిలో కొంత భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం కళ్ల సమస్య కొంత తగ్గినట్లు పాల్ తెలిపాడు.
Also Read: కదిలే రైలులో టాయిలెట్ ముందు వివాహం.. చాలా పెద్ద స్టోరీనే ఉంది