Bharat Innovates: ముంబైలో భారత్ ఇన్నోవేట్స్ డీప్-టెక్ ప్రీ-సమ్మిట్ ప్రారంభం

దేశంలోని అభివృద్ధి చెందుతున్న డీప్-టెక్ స్టార్టప్‌లకు వేదికగా నిలిచే Bharat Innovates Deep-Tech Pre-Summit శనివారం ఐఐటి బాంబే రీసెర్చ్ పార్క్‌లో ఘనంగా ప్రారంభమైంది. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అధికారులు, అకాడమిక్ నాయకులు, పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు.

Bharat Innovates: ముంబైలో భారత్ ఇన్నోవేట్స్ డీప్-టెక్ ప్రీ-సమ్మిట్ ప్రారంభం
Ajay Kumar Sood

Updated on: Mar 21, 2026 | 9:28 PM

దేశంలోని అభివృద్ధి చెందుతున్న డీప్-టెక్నాలజీ స్టార్టప్‌లకు వేదికగా నిలిచే “భారత్ ఇన్నోవేట్స్ డీప్-టెక్ ప్రీ-సమ్మిట్” శనివారం ఐఐటి బాంబే రీసెర్చ్ పార్క్‌లో ఘనంగా ప్రారంభమైంది. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు, విద్యా రంగ ప్రముఖులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి, శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరందికర్, ఐఐటి బాంబే గవర్నర్ల మండలి చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్, ఐఐటి బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ కేదారే తదితరులు హాజరయ్యారు.

సమ్మిట్‌కు దేశవ్యాప్తంగా 3,000కు పైగా స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోగా, వాటిలో 137 అత్యుత్తమ డీప్-టెక్ స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు ప్రొఫెసర్ కేదారే తెలిపారు. ఈ రెండు రోజుల సదస్సు ద్వారా స్టార్టప్‌లు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, ఐఐటీలు మరియు ఐఐఎస్‌సీ ప్రతినిధులు ఒక వేదికపైకి వచ్చి దేశంలో డీప్-టెక్ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మాట్లాడుతూ, దేశ సాంకేతిక నాయకత్వం, ప్రపంచ పోటీ సామర్థ్యాన్ని పెంపొందించడంలో డీప్-టెక్ ఆవిష్కరణలు కీలకమని పేర్కొన్నారు. విద్యాసంస్థలు, పరిశోధనా వ్యవస్థలు, స్టార్టప్‌లు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

స్టార్టప్‌లను ఉద్దేశించి డాక్టర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, “మీరు భారతదేశానికి కొత్త చరిత్ర రాయబోతున్నారు. ఫ్రాన్స్‌కు వెళ్లినప్పుడు దేశ ప్రతినిధులుగా నిలవాలి. దేశ గౌరవం పెంచేలా కృషి చేయాలి” అని సూచించారు. శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి కరందికర్ మాట్లాడుతూ, ఈ సదస్సు దేశ సమస్యల పరిష్కారానికి దోహదపడటమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే దిశగా ముందుకు నడిపిస్తుందని అన్నారు. డాక్టర్ వినీత్ జోషి మాట్లాడుతూ, విద్య కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని, ఇలాంటి వేదికలు ఆవిష్కరణలకు బలం ఇస్తాయని తెలిపారు. సమ్మిట్‌లో భాగంగా స్టార్టప్ ప్రదర్శనలు, పెట్టుబడిదారులతో చర్చలు, పిచింగ్ సెషన్లు నిర్వహించారు. మొదటి రోజు 70కి పైగా స్టార్టప్‌లు తమ ఆలోచనలను ప్రదర్శించాయి. మార్చి 22న రెండో రోజు కార్యక్రమాల్లో మరిన్ని ప్రదర్శనలు, విధాన చర్చలు, ఫైనల్ పోటీలు నిర్వహించి ఉత్తమ ఆవిష్కరణలకు పురస్కారాలు అందజేయనున్నారు.

భారత్ ఇన్నోవేట్స్ 2026: భారత ఆవిష్కరణలకు అంతర్జాతీయ వేదిక

దేశంలోని పరిశోధన ఆధారిత సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో “భారత్ ఇన్నోవేట్స్ 2026” కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం వ్యూహాత్మక మార్గదర్శకత్వంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ సాంకేతిక సంస్థల్లో అభివృద్ధి చెందిన సాంకేతిక ఆవిష్కరణలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ఇది ఒక ముఖ్యమైన అవకాశంగా నిలుస్తోంది. ముఖ్యంగా పరిశోధన ఆధారిత నూతన సాంకేతికతలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.

ఈ కార్యక్రమం కింద వివిధ అభివృద్ధి దశల్లో ఉన్న (టిఆర్ఎల్ 3 నుంచి 9 వరకు) సుమారు 100 ప్రతిభావంతమైన, వినూత్న సాంకేతిక ఆవిష్కరణలను ఎంపిక చేసి, వాటికి మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందిస్తారు. అనంతరం వీటిని అంతర్జాతీయ స్థాయిలో పరిశ్రమ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, భాగస్వాములు, సాంకేతిక నిపుణుల ముందుకు తీసుకువెళ్తారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం సాంకేతిక రంగంలో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు, పెట్టుబడులను ఆకర్షించే దిశగా ముందడుగు వేస్తోంది.

ఐఐటి బాంబే విశేషాలు

1958లో స్థాపించబడిన ఐఐటి బాంబే దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్, సైన్స్ విద్యాసంస్థలలో ఒకటి. 2018లో ‘ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్’ హోదా పొందిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2026 క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో భారతదేశంలో 2వ స్థానం, ప్రపంచంలో 129వ స్థానం సాధించింది. గత ఆరు దశాబ్దాల్లో 75,000కు పైగా ఇంజినీర్లు, శాస్త్రవేత్తలను తయారు చేసిన ఈ సంస్థలో ప్రస్తుతం 760 మంది అధ్యాపకులు సేవలందిస్తున్నారు.

IIT Bombay

 

Follow Us