Snake in Midday Meal: మధ్యాహ్న భోజనంలో చచ్చిన పాము.. పక్కన పడేసి పిల్లలకు ఒడ్డించిన స్కూల్‌ సిబ్బంది! ఆ తర్వాత జరిగిందిదే

ఆ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఏకంగా ఓ భారీ పాము కనిపించింది. భోజనంలో బాగా ఉడికిపోయిన పామును గుర్తించిన సిబ్బంది.. కూరలో కరివేపాకు తీసేసినట్లు, దానిని తీసిపక్కన పడేసి.. విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఒడ్డించారు. దీంతో దాదాపు 100 మందికిపైగా పిల్లలు ఆస్పత్రి పాలై ప్రాణాలతో పోరాడుతున్నారు..

Snake in Midday Meal: మధ్యాహ్న భోజనంలో చచ్చిన పాము.. పక్కన పడేసి పిల్లలకు ఒడ్డించిన స్కూల్‌ సిబ్బంది! ఆ తర్వాత జరిగిందిదే
Dead Snake Found In Mid Day Meal

Updated on: May 02, 2025 | 4:53 PM

పాట్న, మే 2: ప్రభుత్వ బడి పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యత నానాటికీ నేల చూపులు చూస్తుంది. కనీసం పసి పిల్లలకు అందించే పడికెడు భోజనం కూడా పరిశుభ్రంగా అందించేని స్థితికి బీహార్‌ ప్రభుత్వం చేరుకుంది. తాజాగా ఆ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఏకంగా ఓ భారీ పాము కనిపించింది. భోజనంలో బాగా ఉడికిపోయిన పామును గుర్తించిన సిబ్బంది.. కూరలో కరివేపాకు తీసేసినట్లు, దానిని తీసిపక్కన పడేసి.. విషపూరితమైన ఆహారాన్ని పిల్లలకు ఒడ్డించారు. దీంతో దాదాపు 100 మందికిపైగా పిల్లలు ఆస్పత్రి పాలై ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ సంఘటన గత వారం పాట్నాలోని మోకామాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది.

పాట్నాలోని మెక్రా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గత వారం ఏప్రిల్ 24న మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 100 మందికి పైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. రంగంలోకి దిగిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దర్యాప్తు చేయగా.. పిల్లలకు ఒడ్డించిన మధ్యాహ్న భోజనంలో చచ్చిన పాము కనిపించినట్లు ధృవీకరించింది. దీంతో ఈ ఘటనపై తదుపరి చర్యలకు ఉపక్రమించింది. మధ్యాహ్న భోజన పథకం కింద అందించిన ఈ విషపూరితమైన ఆహారాన్ని అదే రోజు పాఠశాలకు చెందిన దాదాపు 500 మంది పిల్లలు తిన్నారు. మోకామాలోని రిఫెరల్ ఆసుపత్రిలో చేరిన రెండు డజన్లకు పైగా పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు బార్హ్ సబ్-డివిజనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సంఘటన జరిగిన రోజు భోజనంలో చచ్చిన పాము కనిపించగా.. దానిని వంటవాడు ఆహారంలో నుంచి తీసి పక్కన పడేసి.. పిల్లలకు వడ్డించినట్లు NHRC దర్యాప్తులో తేలింది. ఇది మానవ హక్కుల ఉల్లంగనేనని, నేరం రుజువైతే కఠిన చర్యలు తప్పవని NHRC వార్నింగ్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పాట్నా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్‌కు NHRC నోటీసులు జారీ చేసింది. బాధిత పిల్లల ఆరోగ్య స్థితితో పాటు రెండు వారాల్లోగా ఈ సంఘటనపై వివరణాత్మక నివేదికను అందించాలని నోటీసుల్లో కోరింది.

ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. విషపూరితమైన ఆహారాన్ని తిన్న తర్వాత పిల్లలు వాంతులు చేసుకోవడం, తల తిరగడం వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. పిల్లల శరీరంలో విషపూరిత పదార్థాల జాడ కనిపించలేదని వైద్యులు తెలిపారు. అయితే భోజనంలో పాము పడిన విషయం తెలిసి కొందరు పిల్లలు తినడానికి నిరాకరిస్తే.. వారితో పాఠశాల సిబ్బంది బలవంతంగా తినిపించినట్లు కొందరు విద్యార్ధులు తెలిపారు. యావత్‌ దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన ఈ దారుణ ఘటన బీహార్‌లో జరగడం ఇదేం తొలిసారికాదు. 2013లోనూ బీహార్‌లోని సరన్ జిల్లాలో జరిగింది. పురుగుమందు కలిసిన భోజనం తిని ఏకంగా 23 మంది పిల్లలు మృతి చెందారు. ఈ సంఘటన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఆహార భద్రతను మెరుగుపరచడంపై చర్యలు చేపట్టింది. కానీ అక్కడి ప్రభుత్వం చర్యలు ఎంత పేలవమైనవో తాజా ఘటన మరోమారు నిరూపించాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.