కరువుపని డబ్బులు కొట్టేసేందుకు.. మగవారికి చీరలు కట్టి..!

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MNREGA) లో భారీ అక్రమం బయటపడింది. అధికారులు పురుషులను మహిళల వేషంలో సిద్ధం చేసి, వారి పేర్లతో పని చేయనివ్వకుండా డబ్బులు దోచుకున్నారు. ఈ అక్రమం వలన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి. దర్యాప్తులో ఈ అక్రమం బయటపడి, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. ఇది MNREGA పథకం యొక్క దుర్వినియోగానికి ఉదాహరణ.

కరువుపని డబ్బులు కొట్టేసేందుకు.. మగవారికి చీరలు కట్టి..!
Mnrega Scam

Updated on: Apr 09, 2025 | 7:26 PM

వలసలు నివారించేందుకు, పని చేసేందుకు సిద్ధంగా ఉన్నవారికి పని కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని (MNREGA) కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకంలో పని చేసుకుంటూ ఎంతో మంది పేదలు ఉపాధి పొందుతున్నారు. కానీ ఈ అధికారులు పథకాన్ని దుర్వినియోగం చేస్తూ.. డబ్బు దోచుకునేందుకు మగవారికి మహిళల వేషం వేశారు. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గిర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మల్హార్ పంచాయతీ ప్రాంతంలోని నింగప్ప పూజారి అనే రైతు భూమిలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఒక కాలువను తవ్వారు.

వందలాది మంది కూలీలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ పనిని ప్రారంభించారు. జాబ్ కార్డులు ఉన్న కార్మికులు ఇందులో పాల్గొన్నారు. ఫిబ్రవరిలో పనులు ప్రారంభమయ్యాయి, వందలాది మంది కార్మికులు కాలువను తవ్వుతున్నారు. కానీ పని ఇంకా పెండింగ్‌లో ఉండగానే డబ్బు వసూలు చేయడానికి అధికారులు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సాధారణంగా ఉదయం పని ప్రారంభించే సమయంలో కూలీల ఫోటోను అప్‌లోడ్ చేయాలి. తరువాత, సాయంత్రం, ఒక ఫోటోను అప్‌లోడ్ చేయాలి.

ఇక్కడ అధికారులు చేసింది ఏమిటంటే, మహిళలు పనికి రాకపోయినా, మహిళల వేషధారణలో పురుషులను సిద్ధం చేసి ఫొటోలు తీసి అప్లోడ్‌ చేశారు. అయితే, అనుమానం వచ్చిన సీనియర్ అధికారులు దర్యాప్తు చేపట్టడంతో అసలు బండారం బయటపడింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ పనిని పంచాయతీలో MNREGA పనులను పర్యవేక్షిస్తున్న వీరేష్ అనే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి చేసినట్లు తెలిసింది. గతంలో కూడా ఇలాంటి స్కామ్‌లు ఏమైనా చేశారని అధికారులు జిల్లా వ్యాప్తంగా కూడా విచారణ చేపట్టారు. జాబ్‌ కార్డులో పేరున్న మహిళల స్థానంలో పురుషులకు చీరలు కట్టి, వాళ్లు పని చేయకపోయినా.. వారి పేరిట డబ్బులు డ్రా చేసేందుకు ఈ పని చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.