బీజేపీలో చేరిన నటి ఖుష్బూ తను వదిలిపెట్టిన కాంగ్రెస్‌పార్టీని తీవ్రంగా విమర్శించారు.. అదో మానసిక ఎదుగుదల లేని పార్టీ అని ఈసడించుకున్నారు.. ఆ పార్టీ నాయకులకు బుర్ర కూడా తక్కువే నంటూ ఎద్దేవా చేశారు. వివిధ రాష్ట్రాలలో తాను పార్టీ కోసం ప్రచారం చేసినప్పుడు తానో సినీ నటినని తెలియదా అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు ఖుష్బూ.. తాను డీఎంకే నుంచి బయటకు వచ్చేసి కాంగ్రెస్‌లో చేరినప్పుడు డీఎంకేను పల్లెత్తు మాట కూడా అనలేదని, అది తన సంస్కారమని, ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తించాలని అనుకున్నానని, కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రం తనను వదిలిపెట్టకపోయేసరికి విమర్శించాల్సి వస్తోందని తెలిపారు. వారు తనపై నానా మాటలంటున్నందుకే తాను మాట్లాడాల్సి వస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్‌లో తనను అణదొక్కారని, అక్కడ తెలివిలేనివారే ఎక్కువగా ఉన్నారని విమర్శించారు. తనకు తెలివి ఉన్నది కాబట్టే ఆ పార్టీని విడిచిపెట్టానని అన్నారు. భారతీయ జనతాపార్టీలో చేరడానికి తన భర్త సుందర్ కారణం కాదని వివరణ ఇచ్చుకున్నారు. తమిళనాడు బీజేపీలో ఖుష్బూ చేరడంతో ఆ పార్టీ గ్లామర్ మరింత పెరిగింది.. ఇప్పటికే నమిత, గౌతమి, గాయత్రి రఘురామ్, మధువంతి, కుట్టి పద్మిని, నటుడు రాధారవి, సంగీతదర్శకుడు, ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ బీజేపీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపించాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది.. కనీసం 60 స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు బీజేపీ నేతలు.. అన్నా డీఎంకేతో పొత్తు ఉంటే కనుక 60 సీట్లను డిమాండ్ చేయాలని భావిస్తున్నారు.