
గురువాయూర్, మే 13: అరియన్నూర్‌లో నివాసం ఉంటున్న పొక్కక్కిల్లత్ కుంజుముహమ్మద్ ఇంట్లో గత శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. పై అంతస్తులోని గదిలో ఉంచిన రెండు గాజులు, రెండు గొలుసులు, మూడు జతల చెవి కమ్మలు చోరీకి గురయ్యాయి. చోరీ సమయంలో పక్క గదిలో కుంజుముహమ్మద్ కుమార్తె బుష్రా పీకే, ఆమె భర్త అబూబక్కర్ ముహమ్మద్ రఫీ నిద్రపోతున్నారు. పై అంతస్తులోకి వెళ్లే తలుపు మూసి ఉండకపోవడంతో, దొంగ దాని ద్వారానే ఇంట్లోకి ప్రవేశించాడు. గదిలోకి ప్రవేశించిన తర్వాత దొంగ చేసిన దాదాపు అన్ని పనులను సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ దృశ్యాలలో అతని ముఖం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
గమనించని ఇంటి యజమాని తెల్లారి కూడా తన ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించలేదు. మరుసటి రోజు ఉదయం బుషారా తన కమ్మల కోసం అల్మారా తీయగా.. అందులో తన కమ్మలతోపాటు ఇతర బంగారం కూడా కనిపించలేదు. వెంటనే కుటుంబ సభ్యులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా దొంగతనం జరిగినట్లు గ్రహించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఇంట్లో వేలిముద్రలు ఇతర ఆధారాలను సేకరించారు. అయితే తాను
దొంగతనంకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ కావడంతో తాను పట్టుబడతానని భావించిన దొంగ.. దొంగిలించిన 10 తులాల్లో 8 తులాలు ఇంటి యజమాని గేటు లోపల ఓ కవరులో చుట్టి తీసుకువచ్చి భద్రంగా ఉంచాడు. దానితో పాటు అస్పష్టంగా అక్షర దోషాలతో నిండిన ఒక ఉత్తరం కూడా ఉంచాడు. సోమవారం ఉదయం ఆ కవరు విప్పిచూడగా ‘అయ్యా, నేను తప్పు చేశాను. క్షమించండి. నేను ఈ బంగారంలో 2 తులాలు తీసుకుని అమ్మేశాను. దయచేసి కేసును ఉపసంహరించుకోండి. క్షమించండి, క్షమించండి, క్షమించండి..’ అని ఆ ఉత్తరంలో రాశాడు. అంతేకాకుండా తాను అమ్మిన 2 తులాల బంగారాన్ని తిరిగి ఇస్తానని కూడా అందులో రాశాడు. ఇలా చోరీ చేసిన బంగారాన్ని తిరిగి ఇచ్చి క్షమాపణ చెప్పాడని పోలీసులు నిర్ధారించారు. ఇంటి బయట సీసీటీవీ లేకపోవడంతో, బంగారాన్ని లోపలికి తీసుకువస్తున్న దృశ్యాలు ఏవీ లభించలేదు. ఒక నెక్లెస్, ఒక జత చెవిపోగులు మినహా మిగిలిన బంగారు ఆభరణాలన్నీ తిరిగి ఇచ్చేసినట్లు బాధితులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.