Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ నేతల మౌనం.. అసలు కారణం ఇదేనా..?

Karnataka Hijab Row: కర్నాటకలో కొనసాగుతున్న హైజాబ్ వివాదంలో బీజేపీని ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే దానిపై కర్ణాటకలో ప్రధాన..

Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై కాంగ్రెస్ నేతల మౌనం.. అసలు కారణం ఇదేనా..?
Congress
Shiva Prajapati

|

Feb 19, 2022 | 4:45 PM

Karnataka Hijab Row: కర్నాటకలో కొనసాగుతున్న హైజాబ్ వివాదంలో బీజేపీని ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలనే దానిపై కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత (సిఎల్‌పి) సిద్ధరామయ్య మధ్య సమన్వయం కరువైంది. దూకుడుగా వ్యవహరించాలని, బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని ఒకరు కోరుకుంటుంటే.. శాంతం శాంతం అని మరొకరు జపిస్తున్నారు. పార్టీ వర్గాలు మాత్రం.. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో హిజబ్ అంశాన్ని చాలా బలంగా లేవనెత్తాలని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుతున్నారు. పార్టీలో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితి.. రాష్ట్రస్థాయి నేతలు మొదలుకొని, క్షేత్రస్థాయి కేడర్ వరకు అయోమయానికి గురిచేస్తోంది.

ఇదిలాఉంటే హిజాబ్ సహా పలు అంశాలపై చర్చించేందుకు ఇటీవల పార్టీ సీనియర్ నాయకులంతా సమావేశమయ్యారు. హైకమాండ్‌తో సంప్రదింపుల తర్వాత బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద ప్రకటనలను మాత్రమే అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాలని పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశంలో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. బెంగుళూరులోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో మూడు గంటలపాటు సుధీర్ఘ సమావేశం తర్వాత బటయకొచ్చిన సిద్ధరామయ్య.. హిజాబ్ అంశంపై పార్టీ వైఖరి స్పష్టంగా లేదని, అందువల్ల ఏకాభిప్రాయానికి రావడానికి చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మైనారిటీలకు అండగానే ఉంటుంది. మేము హిందువులు, మైనారిటీల హక్కులను, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాము. రాజ్యాంగంలోని లౌకికవాదాన్ని నిలబెట్టడం మా బాధ్యత. ఈ అంశంపై పార్టీ వైఖరి స్పష్టంగా లేదు. ఈ సమస్యపై సీనియర్ నాయకులతో చర్చించాం. ఒక స్టాండ్ తీసుకున్నాం.’’ అని సిద్ధ రామయ్య చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే.. జాతీయ జెండాపై బీజేపీ నేత, మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. “రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. ప్రభుత్వం సమాజంలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. క్లిష్ట సమయంలో ప్రజల గొంతుకగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్‌కు ఉంది.’’ అని అన్నారు. ఇదిలాఉంటే.. హిజాబ్ విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలని, బీజేపీ ఉచ్చులో చిక్కుకోవద్దని కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది.

ఇదిలాఉంటే హిజాబ్ విషయంలో డీకే శివకుమార్ వైఖరికి ఢిల్లీ మద్ధతు లభించినట్లు కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది. ఇదే విధానాన్ని అనుసరించాలని హైకమాండ్ సూచించినట్లు సమాచారం. అయితే, డీకేకి విధానాలపై సిద్ధ రామయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ప్రజా పోరాటం చేయకుండా.. నేరుగా అసెంబ్లీలోనే ఈ వ్యాఖ్యలను ప్రస్తావించాలనే నిర్ణయంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, జాతీయ జెండాపై కేఎస్ ఈశ్వరప్ప చేసిన ప్రకటనపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చింది సీఎల్పీ. ‘‘భవిష్యత్‌లో కాషాయ జెండా జాతీయ జెండాగా మారవచ్చు’’ అంటూ కేఎస్ ఈశ్వరప్ప చేసిన కామెంట్స్‌ని ప్రస్తావిస్తూ సీఎల్పీ నేత సిద్దరామయ్య తీర్మానం పెట్టగా సభలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక సమయంలో డీకే శివకుమార్.. మంత్రి ఈశ్వరప్ప సీటు వద్దకు వెళ్లి ఆయనతోనే వాగ్వాదానికి దిగారు.

మౌనం, మౌనం.. ఇక రాష్ట్రంలో నెల రోజులుగా ఈ సమస్య రగులుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతలు మాత్రం మౌనంగా ఉంటూ వస్తున్నారు. విలేకరులు ప్రశ్నించినప్పుడు మాత్రం నామమాత్రంగా స్పందిస్తున్నారు. వివాదం మరింత ముదురుతుండటంతో సిద్దరామయ్య మౌనం వీడారు. బీజేపీ నేతలపై పలు కామెంట్స్ చేశారు. అయితే, ఈ సమయంలోనూ పార్టీ నుంచి సిద్దరామయ్యకు మద్దతు లభించలేదు. పైగా హైకామాండ్ నుంచి కామ్ గా ఉండండి అంటూ సందేశాలు వెళ్లడం కొసమెరుపు. ఇక హిజాబ్ సమస్య ఇతర కాలేజీలకు వ్యాపిస్తుండటంతో, బీజేపీ నేతలు ఇష్టారీతిన కామెంట్స్ చేస్తుండటంతో మౌనంగా ఉండటం, దిక్కులు చూడటం సరికాదనే భావనలోకి వచ్చారు కర్నాటక కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్‌లోని కొందరు నేతలు మాత్రం.. ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు. పార్టీ నేతలు ఎవరూ తొందర పడొద్దని, తొందరపడి బీజేపీకి ఫేవర్ చేయొద్దని అంటున్నారు ముఖ్య నేతలు.

హిజాబ్ విషయంలో బీజేపీపై దూకుడుగా వ్యవహరిస్తే హిందూ ఓట్లు ఏకీకృతమై అధికార బీజేపికే లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్ ముఖ్య నేతల భావన. ఆ భయంతోనే ఈ హిజాబ్ అంశంలో ఎలాంటి వైఖరిని తీసుకోవాలనే దానిపై సందిగ్ధంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాగని ఈ అంశంపై మెతక వైఖరి అవలంభించడం కూడా ఆ పార్టీకి చెడు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముస్లిం ఓటర్లను కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు.

‘‘కాంగ్రెస్‌కు ఇది చాలా కఠినమైన పరిస్థితి. కాంగ్రెస్ నేతలు ఎంత ఎక్కువ మాట్లాడితే, అది బీజేపీకి అంత ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు మైనారిటీలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి. మరోవైపు, పార్టీ ప్రణాళికలు హిందువులను బాధపెట్టకుండా చూసుకోవాలి.’’ అని బెంగళూరుకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళంపై కర్ణాటక యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్ హరీశ్ రామస్వామి మాట్లాడుతూ.. ‘‘ఈ వివాదంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తమ కేంద్ర నాయకత్వంతో సమన్వం చేసుకుంటూ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని, ముస్లింలకు మద్దతు ఇస్తుందని బీజేపీ ఎప్పటినుంచో ఆరోపిస్తూనే ఉంది. అదే ప్రధాన ఆయుధంగా బీజేపీ తన ప్రత్యర్థి కాంగ్రెస్‌పై దాడి చేసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సందిగ్ధంలో ఉంది. వారు ఏ స్టాండ్ తీసుకున్నా పార్టీకి నష్టమే వాటిల్లుతుంది.’’ అని పేర్కొన్నారు.

ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మైసూర్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ముజఫర్ అస్సాదీ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ ఒక స్టాండ్ తీసుకుంటే శాశ్వతంగా నష్టపోతుందనే భయంతో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి కాంగ్రెస్ ఏ స్టాండ్ తీసుకున్నా.. అది రాజకీయంగా తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఉదాహరణగా బాబ్రీ మసీదు అంశాన్నే తీసుకుంటే.. ఆ సమయంలో కాంగ్రెస్ కోలుకోలేని స్థాయిలో నష్టపోయింది. కర్నాటకలో 14 శాతం మంది ముస్లింలు ఉన్నారు. జనాభా పరంగా వీరు కోటి మందికిపైగానే ఉన్నారు. అంటే.. 30 నియోజవర్గాలను వీరు ప్రభావితం చేస్తారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఒక స్టాండ్ తీసుకోకుండా తఠస్థంగా ఉంది. మరో కీలక అంశం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీలో శక్తివంతమైన ముస్లిం నాయకులు ఎవరూ లేపోవడం పెద్ద మైనస్.’’ అని చెప్పుకొచ్చారాయన.

ప్రస్తుతానికి హిజాబ్ విషయంలో కాంగ్రెస్ సేఫ్ గేమ్ ఆడుతున్నప్పటికీ.. పార్టీలోని అనైక్యత ఎటువైపునకు దారి తీస్తుందో అని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సిద్దరామయ్య-డీకే శివకుమార్ వ్యవహారం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

Aslo read:

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. భీమ్లానాయక్‌ ట్రైలర్‌ వచ్చేది అప్పుడే..

Punjab Elections 2022: పంచ నదుల పంజాబ్‌ పంచముఖ పోరులో.. ఎవరిది జోరు?

Jaggareddy: అదిగో ఇదిగో అన్నారు.. ఇవాళే గుడ్‌బై చెప్పేస్తానన్నారు.. డెడ్‌లైన్‌ ముగిసే సరికి వెనక్కి తగ్గాడు.. జగ్గారెడ్డి రివర్స్ గేర్!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu