శాటిలైట్ కమ్యూనికేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. నిబంధనలు అందరికీ సమానమే

శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు సంబంధించిన భారత నియంత్రణ వ్యవస్థ న్యాయబద్ధంగా, వివక్ష రహితంగా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. NGSO ఆధారిత శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు మూడు సంస్థలకు టెలికాం లైసెన్సులు ఇచ్చామని తెలిపింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ..

శాటిలైట్ కమ్యూనికేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. నిబంధనలు అందరికీ సమానమే
India satellite communication

Updated on: Oct 08, 2026 | 10:41 AM

శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు సంబంధించిన నియంత్రణ వ్యవస్థపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం అమలు చేస్తున్న నిబంధనలు న్యాయబద్ధంగా, ఎలాంటి వివక్ష లేకుండా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) గురువారం వివరణ ఇచ్చింది. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్ని టెలికాం సేవలకు వర్తించే విధంగా సమానమైన అధికారిక వ్యవస్థను అమలు చేస్తోందని తెలిపింది. ఇందులో భాగంగా నాన్-జియోసింక్రోనస్ శాటిలైట్ ఆర్బిట్‌ (NGSO) ఆధారిత కమ్యూనికేషన్ సేవలను అందించే మూడు గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (GMPCS) సంస్థలకు టెలికాం లైసెన్సులు మంజూరు చేసినట్లు పేర్కొంది.

భద్రతా నిబంధనలు తప్పనిసరి

లైసెన్స్ పొందిన ప్రతి సంస్థ నిర్దేశించిన భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. వినియోగదారులకు అందించే శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలు, వారి డేటా భద్రంగా ఉండేలా ఈ నిబంధనలు రూపొందించినట్లు తెలిపింది. లైసెన్స్ ప్రక్రియలో భాగంగా ఆయా సంస్థల సెక్యూరిటీ అసెస్‌మెంట్ ప్రస్తుతం కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఒక్కో సంస్థకు సంబంధించిన భద్రతా పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి దశలో స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని వివరించింది.

మూడు సంస్థలూ ఒకే దశలో..

ప్రస్తుతం లైసెన్సులు పొందిన మూడు సంస్థలూ దాదాపు ఒకే స్థాయి నియంత్రణ ప్రక్రియలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాబట్టి ఒక సంస్థకు అనుకూలంగా, మరో సంస్థకు ప్రతికూలంగా నిబంధనలు అమలు చేస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో నియంత్రణ వ్యవస్థ అన్యాయంగా లేదా వివక్షపూరితంగా ఉందన్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కేంద్రం పేర్కొంది. వినియోగదారుల భద్రత, డేటా రక్షణకు ప్రాధాన్యమిస్తూ అన్ని సంస్థలకు ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తున్నాయని వెల్లడించింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us