రెచ్చగొడితే పాకిస్తాన్ ఖతమే.. చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం భారత్‌దే: ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది

ఆపరేషన్‌ సింధూర్‌ ఇంకా ముగియలేదని , పాక్‌ రెచ్చగొడితే మళ్లీ గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది. చైనాకు పాకిస్తాన్‌ అప్పగించిన షక్స్‌గామ్‌ భూభాగం ముమ్మాటికి భారత్‌దే అన్నారు. షక్స్‌గామ్‌పై చైనా విదేశాంగశాఖ వ్యాఖ్యలను ఆర్మీ చీఫ్‌ తీవ్రంగా ఖండించారు.

రెచ్చగొడితే పాకిస్తాన్ ఖతమే.. చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం భారత్‌దే: ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది
Indian Army Chief General Upendra Dwivedi

Updated on: Jan 13, 2026 | 8:22 PM

ఆపరేషన్‌ సింధూర్‌ ఇంకా ముగియలేదని, రెచ్చగొడితే మళ్లీ గుణపాఠం తప్పదంటూ.. ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది ఒకేసారి పాకిస్తాన్‌, చైనాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా కొనసాగుతోందన్నారు. భూతల దాడులకు భారత సైన్యం సిద్దంగా ఉందన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌లో పాకిస్తాన్‌ గట్టి గుణపాఠం చెప్పామన్నారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ తీరుమారకుంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పాకిస్తాన్‌లో ఇంకా 8 టెర్రర్‌ క్యాంప్‌లు యాక్టివ్‌గా ఉన్నట్టు గుర్తించామని ఆర్మీ చీఫ్‌ వెల్లడించారు. ఉగ్రవాదులు ఏమాత్రం చెలరేగినా సమాధానం చెప్పేందుకు భారత బలగాలు సిద్దంగా ఉన్నాయన్నారు. ఆర్మీ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు.

‘‘అప్పట్లో భారీగా బలగాలను మోహరించాం.. మన బలగాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఆపరేషన్‌ సింధూర్‌ కొనసాగుతోంది. ఏమాత్రం కవ్వింపు చర్యలు చేపట్టినా గట్టిగా బదులిస్తాం. టెర్రరిస్ట్‌ శిక్షణా శిబిరాల విషయానికొస్తే ఇంకా 8 క్యాంప్‌లు యాక్టివ్‌గా ఉన్నట్టు గుర్తించాం. సరిహద్దుల దగ్గర ఈ క్యాంప్‌లు ఉన్నాయి. ఆ క్యాంప్‌లపై గట్టి నిఘా పెట్టాం. రెచ్చగొడితే కఠినచర్యలు తప్పవు.’’ అంటూ.. ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.

చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం.. ముమ్మాటికి భారత్‌కే చెందుతుందన్న ఆర్మీ చీఫ్‌

రాకెట్‌ ఫోర్స్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది. చైనా,పాకిస్తాన్‌ల రాకెట్‌ ఫోర్స్‌ బలంగా ఉందన్నారు. చైనా కబ్జాలో ఉన్న షక్స్‌గామ్‌ భూభాగం ముమ్మాటికి భారత్‌కే చెందుతుందన్నారు ఉపేంద్ర ద్వివేది. 1961లో ఈ ప్రాంతాన్ని చైనాకు పాకిస్తాన్‌ అప్పగించడాన్ని తాము గుర్తించడం లేదన్నారు. షక్స్‌గామ్‌ ప్రాంతం తమదే అన్న చైనా విదేశాంగశాఖ వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

మరోవైపు జమ్ముకశ్మీర్‌ లోని కథువా ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలను చేపట్టాయి. శ్రీనగర్‌లో కూడా రిపబ్లిక్‌ డే సందర్భంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రతి వాహనాన్ని భద్రతా బలగాలు చెక్‌ చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..