
శబరిమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.. వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభమైన తొలిరోజు నుంచే శబరిమలకు భక్తులు భారీగా పోటెత్తారు. యాత్ర మొదలైన మూడు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల మందికి పైగా చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది. లక్షలాది మంది భక్తులు ఒకేసారి అయ్యప్ప దర్శనం కోసం తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. అయ్యప్ప దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు సరైన ఏర్పాట్లు కూడా చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక.. అనూహ్యంగా భక్తులు పోటెత్తి.. రద్దీ నెలకొనడంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులు నియంత్రించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల ఆలయం వద్ద భక్తుల రద్దీని సరిగా నియంత్రించలేకపోయిన ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) పై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వసతి, పారిశుద్ధ్యం, తాగునీరు, రద్దీ నిర్వహణ, భద్రత వంటి కీలక అంశాల్లో వెంటనే మెరుగుదల చర్యలు చేపట్టాలని బోర్డును ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన TDB ఛైర్మన్ కె. జయకుమార్ కూడా ఏర్పాట్లలో జాప్యాన్ని అంగీకరించారు. మెరుగైన చర్యలు చేపడతామని తెలిపారు.
శబరిమల వద్ద అందుబాటులో ఉన్న అన్ని వనరులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయని, పోలీసులు లేదా దేవస్వం బోర్డు రద్దీని సమర్థవంతంగా అరికట్టలేకపోతున్నాయంటూ.. ఆగ్రహించిన కేరళ హైకోర్టు బుధవారం రోజుకు యాత్రికుల సంఖ్యను 75,000కు పరిమితం చేసింది. శబరిమల వద్ద జనసమూహ నిర్వహణపై ప్రారంభించిన సుమోటో విచారణలో న్యాయమూర్తులు రాజా విజయరాఘవన్ – కెవి జయకుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్, యాత్రికుల రద్దీ లక్ష దాటినప్పుడు, ఆలయంలోని కొన్ని ప్రాంతాలలో జనం రద్దీ తవ్రంగా పెరిగిందని.. రెడ్ జోన్ (హై రిస్క్ క్రష్ జోన్)లోకి ప్రవేశించిందని, ఇది ప్రజల భద్రతకు ఆమోదయోగ్యం కాని ప్రమాదాన్ని కలిగిస్తుందని పేర్కొంది.
ఈ సంవత్సరం వార్షిక యాత్రికుల సీజన్ నవంబర్ 16న ప్రారంభమైనప్పుడు, రాష్ట్ర పోలీసులు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా రోజుకు 70,000 మంది భక్తులను – స్పాట్ బుకింగ్ ద్వారా మరో 20,000 మంది భక్తులను అనుమతించవచ్చని నిర్ణయించారు. అయితే, గత రెండు రోజుల్లో, ఆలయంలో దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చారు.. దీంతో చర్యలు తీసుకున్నారు. వర్చువల్ క్యూ బుకింగ్‌ను 70,000 వద్ద, స్పాట్ బుకింగ్‌ను 5,000 వద్ద పరిమితం చేయాలన్న కోర్టు ఆదేశం నవంబర్ 24 వరకు అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. యాత్రికులకు దీర్ఘకాలిక సన్నద్ధత – ప్రాథమిక సౌకర్యాల లభ్యత లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు వివిధ ప్రాంతాల నిపుణులతో కూడిన శబరిమల మౌలిక సదుపాయాలు – క్రౌడ్ మేనేజ్‌మెంట్ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పేర్కొంది.
మూడు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల మంది అయ్యప్ప దర్శనానికి రావడం.. వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్నవారు బుక్ చేసుకున్న రోజు రాకపోవడం, క్యూలైన్లను తప్పించుకోవడం లాంటి పరిణామాలు రద్దీకి కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..