IRCTC నిర్లక్ష్యం.. రైలు టాయిలెట్‌లోనే ఫుడ్ ప్లేట్లు శుభ్రం..? FSSAI సీరియస్

Duronto Express Train Toilet Incident: ముంబై–ఎర్నాకుళం దురంటో ఎక్స్‌ప్రెస్‌లో టాయిలెట్‌లోనే క్యాటరింగ్ పాత్రలు శుభ్రం చేస్తున్నట్లు ఉన్న వీడియో వెలుగులోకి రావడంతో FSSAI తీవ్రంగా స్పందించింది. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనగా భావిస్తూ IRCTCకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది..

IRCTC నిర్లక్ష్యం.. రైలు టాయిలెట్‌లోనే ఫుడ్ ప్లేట్లు శుభ్రం..? FSSAI సీరియస్
Duronto Express Toilet Incident

Updated on: May 29, 2026 | 10:59 AM

న్యూఢిల్లీ, మే 29: రైలులో ప్రయాణించే జనాలకు ఆహారం ఆదించే పాత్రలను IRCTC సిబ్బంది టాయిలెట్‌లో శుభ్రం చేసిన ఘటన ముంబై–ఎర్నాకుళం కు వెళ్లే దురంటో ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. ఈ రైలులోని క్యాటరింగ్ సిబ్బంది రైలు టాయిలెట్‌లో పాత్రలు శుభ్రం చేస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కు నోటీసులు జారీ చేసింది. ‘ట్రూత్ ఆన్ ట్రాక్’ అనే ఎక్స్‌ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియోలో టాయిలెట్‌లో ఉన్న IRCTC సిబ్బంది పక్కనే బాస్కెట్‌లో ఆహార పాత్రలు, కట్లరీ కనిపించాయి. రైలులో ప్రయాణికులకు అందించే భోజన పాత్రలను అత్యంత అనారోగ్యకర పరిస్థితుల్లో శుభ్రం చేస్తూ కనిపించాడు.

ఈ ఘటన దురంతో ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ ఏసీ కోచ్‌లో జరిగినట్లు పోస్టులో పేర్కొన్నారు. ప్రీమియం క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికులు మెరుగైన సేవలు, పరిశుభ్రత ఆశిస్తారని.. ప్రయాణికులకు ఇలాంటి పాత్రల్లో భోజనం ఎలా అందిస్తారని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి. వీడియోలో ఓ ప్రయాణికుడు సిబ్బందిని ప్రశ్నిస్తూ.. “ఏం చేస్తున్నారు? ఇది పాత్రలు శుభ్రం చేసే సరైన ప్రదేశమా?” అని ప్రశ్నించడం వీడియోలో కనిపిస్తుంది. అయితే సిబ్బంది మౌనంగా ఉండిపోయాడు. అనంతరం బయట ఉన్న అటెండెంట్‌ను ప్రశ్నించగా “అతడు ఇప్పుడే చూశాను” అని సమాధానం ఇవ్వడం వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

దురంటో ఎక్స్ ప్రెస్ ట్రైన్ వీడియో ఇక్కడ చూడండి..

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికుడు “టాయిలెట్‌లో పాత్రలు శుభ్రం చేస్తున్న విషయం మీకు తెలియదా? ఇదే పాత్రల్లో భోజనం వడ్డిస్తున్నారా?” అని నిలదీశాడు. దీనికి అటెండెంట్ స్పందిస్తూ “నేను చూడలేదు. సాధారణంగా పాత్రలు కడిగేవారు అక్కడే కడుగుతారు” అని తెలిపాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంపై స్పందించిన FSSAI..12223 లోక్‌మాన్య తిలక్‌ టెర్మినస్‌ (ఎల్‌టీటీ) ముంబయి- ఎర్నాకుళం దురంటో ఎక్స్‌ప్రెస్‌లో క్యాటరింగ్‌ సిబ్బంది టాయిలెట్‌లో పాత్రలు శుభ్రం చేస్తున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనపై వాస్తవ నివేదిక ఇవ్వాలని IRCTCను ఆదేశించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్-2011లోని షెడ్యూల్-4 నిబంధనలకు ఇది విరుద్ధమని FSSAI తన నోటీస్‌లో పేర్కొంది. ఆహార పదార్థాలు, వాటికి సంబంధించిన పాత్రలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడం ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ బాధ్యత అని, ఆహార కలుషితాన్ని నివారించేందుకు శుభ్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని FSSAI సంస్థ స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు ఈ వ్యవహారంపై IRCTC అధికారికంగా స్పందించకపోవడం విశేషం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us